Many Projects Stopped in Midway: హాస్పిటల్, ఎమ్మార్వో ఆఫీస్, కోల్డ్ స్టోరేజ్, హాస్టల్, ఆడిటోరియం, ప్లే గ్రౌండ్, తల్లీబిడ్డల ఆరోగ్య కేంద్రం ఇవన్నీ ప్రజలకు అత్యవసరమైనవి. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి చాలా భవనాలు అర్ధాంతరంగా ఆగిపోయిన దశలో ఉన్నాయి. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై, చాలావరకు పూర్తైన కొన్ని వందల నిర్మాణాలను తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం చేసింది. దీంతో అవన్నీ ఇప్పటికీ మొండిగోడలుగా మిగిలిపోయాయి. కేవలం రూ.90 కోట్ల వ్యయంతో 20కి పైగా భవనాలు, ప్రాజెక్టులను అందుబాటులోకి తేవొచ్చు. ప్రభుత్వం వీటిని తొలి ప్రాధాన్యంగా గుర్తించి, ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే, లక్షల మందికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది.
ధాన్యం నిల్వకు గోదాం:గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గోదాం అసంపూర్తిగా నిలిచిపోయింది. 10 వేల ధాన్యం బస్తాలు నిల్వ చేసుకునేలా రూ.55 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు. కానీ మధ్యలోనే ఆగిపోయింది. దీన్ని పూర్తి చేసేందుకు రూ.41.70 లక్షలు అవసరం. ఇది పూర్తైతే ఫిరంగిపురం, మేడికొండూరు మండలాల రైతులు ధాన్యం నిల్వ చేసుకోవచ్చు.
శ్లాబులు మాత్రమే పూర్తయ్యాయి:శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండలో 2016లో రూ.25 కోట్లతో బీసీ బాలికల గురుకుల కాలేజీ నిర్మాణం చేపట్టారు. జీ+2 బిల్డింగ్‌లో శ్లాబులు పూర్తయ్యాయి. ఫస్ట్ ఫ్లోర్ వరకు గదుల గోడలు నిర్మించారు. మొత్తంగా 60% పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్‌కు రూ.8 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.1.50 కోట్ల పెండింగ్ ఉంది.
పేద విద్యార్థుల కోసం హాస్టల్:అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని సుండుపల్లి రోడ్డులో రూ.2 కోట్లతో చేపట్టిన బీసీ విద్యార్థుల హాస్టల్ పెండింగ్‌లో ఉంది. దీంతో ప్రస్తుతం బీసీ విద్యార్థుల హాస్టల్‌ను అద్దె భవనాల్లో నడుపుతున్నారు. మరో రూ.50-60 లక్షలు వెచ్చిస్తే, ఈ భవన నిర్మాణం పూర్తవుతుంది. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మార్వో ఆఫీస్ భవన నిర్మాణాన్ని 2018లో రూ.90 లక్షల అంచనా వ్యయంతో ప్రారంభించారు. రూ.50 లక్షలు వెచ్చిస్తే, ఇది అందుబాటులోకి వస్తుంది.
పారిశ్రామిక శిక్షణ సంస్థ ఏది?:కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ఆరేకల్లులో మైనారిటీ విద్యార్థుల కోసం ఉద్దేశించిన పారిశ్రామిక శిక్షణ సంస్థ, హాస్టల్‌ని ప్రారంభించకుండా వదిలేశారు. ఏటా 200 మంది స్టూడెంట్స్‌కి సంస్థ ప్రాంగణంలోనే వసతి కల్పించి, శిక్షణ ఇవ్వడం లక్ష్యం. 2018లోనే ఇది పూర్తైంది. కానీ ప్రారంభించకుండా వదిలేశారు. శిక్షణా సామగ్రి, బోధన సిబ్బందిని సమకూర్చలేదు. రూ.50 లక్షల్లోపు ఖర్చు చేస్తే ఇది అందుబాటులోకి వస్తుంది.
ఇండోర్ స్టేడియం ఎప్పుడో?:తాడేపల్లిగూడెంలోని గణేశ్‌నగర్‌లో రూ.2 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టి, 80% పూర్తిచేశారు. గుత్తేదారుకు రూ.50 లక్షల బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో పనులు నిలిచిపోయాయి.
పరిశోధన కాంప్లెక్స్ నిర్మాణం:అనకాపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అన్నిరకాల ప్రయోగాలు ఒకేచోట నిర్వహించేలా 2018లో పరిశోధన కాంప్లెక్స్ నిర్మాణం ప్రారంభించారు. రూ.3.47 కోట్ల వ్యయమయ్యే ఈ సముదాయం 2020 మార్చి నాటికే అందుబాటులోకి రావాల్సి ఉండగా, మధ్యలోనే వదిలేశారు. 112 సంవత్సరాల క్రితం నెలకొల్పిన ప్రస్తుత కేంద్రంలో ఒకప్పుడు చెరకు పంటపై పరిశోధనలు చేసేవారు. నిర్వహణ లేకపోవడంతో టిష్యూకల్చర్ చెరకు వంగడాలపై పరిశోధనలు నిలిపేశారు. దీనికి రూ.1.80 కోట్ల ఖర్చు అవుతుంది.
తల్లీబిడ్డల సౌఖ్యమెరిగి:ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నిర్మిస్తున్న 50 పడకల తల్లీబిడ్డల హాస్పిటల్. రూ.9.50 కోట్లతో ఇన్‌పేషెంట్, అవుట్ పేషెంట్ బ్లాక్‌లు కడుతున్నారు. ఒక భవనం పూర్తికాగా, రెండోది 60% నిర్మించారు. గుత్తేదారుకు రూ.4 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. దీనికి రూ.6 కోట్ల వరకు కావాలి.
గోషా హాస్పిటల్పై దృష్టి పెట్టాలి:నెల్లూరు నగరంలో 2021లో రూ.3.82 కోట్లతో గోషా హాస్పిటల్ నిర్మాణం చేపట్టి, 85% పూర్తిచేశారు. గుత్తేదారుకు రూ.20 లక్షల వరకు బిల్లులు బకాయి ఉన్నాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడులో 2021లో రూ.8.6 కోట్లతో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం చేపట్టారు. నిధుల్లేక పనులు నిలిచిపోయాయి.
గురుకుల పాఠశాలకు ఎదురుచూపులు:మైనారిటీ విద్యార్థుల కోసం నెల్లూరు రూరల్ పరిధిలోని అక్కచెరువుపాడులో ఐదెకరాల్లో గురుకుల పాఠశాల నిర్మాణాన్ని రూ.15 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. దాదాపు 70% పూర్తైంది. గుత్తేదారుకు రూ.1.20 కోట్లు మాత్రమే చెల్లించారు. దాదాపు రూ.9 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో గుత్తేదారు పనులు నిలిపేశారు.
శీతల గిడ్డంగికి రాజకీయ అడ్డంకి:ప్రకాశం జిల్లా దర్శి మార్కెట్ యార్డులో శీతల గిడ్డంగి నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. రూ.5 కోట్లతో పనులు చేపట్టారు. అయితే మధ్యలోనే ఆగిపోయింది.
నర్సింగ్ విద్యార్థుల అవస్థలు:శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం వద్ద ఐదెకరాల్లో రూ.12.55 కోట్ల అంచనా వ్యయంతో నర్సింగ్ కళాశాల నిర్మాణం ప్రారంభించారు. 75% పూర్తయ్యింది. గుత్తేదారుకు బిల్లులు చెల్లింకపోవడంతో ఆగిపోయింది. దీన్ని పూర్తి చేసేందుకు రూ.10 కోట్లకుపైగా అవసరం.