ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్​లు-శరవేగంగా ముస్తాబు అవుతోన్న మంగళగిరి స్టేడియం

మంగళగిరి స్టేడియం రూపురేఖల్ని మార్చేందుకు సిద్ధమైన ఏసీఏ - రెండేళ్లలో అంతర్జాతీయ మ్యాచ్​ల నిర్వహణ దిశగా ఏసీఏ ప్రణాళికలు

Mangalagiri_Cricket_Stadium
Mangalagiri Cricket Stadium Remodel (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2024, 3:55 PM IST

Mangalagiri Cricket Stadium Remodel: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భాగమైన మంగళగిరి క్రికెట్‌ స్టేడియం రూపురేఖల్ని అత్యాధునిక సౌకర్యాలతో మార్చేందుకు ఆంధ్రా క్రికెట్‌ అసోషియేషన్ సిద్ధమైంది. వచ్చే రెండేళ్లలో ఐపీఎల్‌ సహా అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణ దిశగా ఏసీఏ పాలకవర్గం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. గత టీడీపీ హయాంలోనే స్టేడియం నిర్మాణ పనులు 90 శాతం పూర్తవ్వగా, వైఎస్సార్సీపీ జమానాలో గాలికి వదిలేశారు. మధ్యలో ఆగిన నిర్మాణాలు కొన్నిచోట్ల దెబ్బతిన్నాయి. వీటిపై నిపుణులు కమిటి నివేదిక రాగానే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఏసీఏ భావిస్తోంది.

ఆట మధ్యలో వర్షం కురిసినా : ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధి, మౌళిక వసతుల కల్పనలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు వద్ద గత టీడీపీ ప్రభుత్వం అంతర్జాతీయ స్టేడియం నిర్మాణం చేపట్టింది. 110 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2019-20లోనే అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించే లక్ష్యంతో పనులు వేగంగా చేశారు. 2019 నాటికే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మైదానం నిర్మించారు. పిచ్‌తో పాటు పచ్చిక కూడా అన్ని రకాల మ్యాచ్ లకు అనువైనట్లుగా సిద్ధం చేశారు. ఆట మధ్యలో వర్షం కురిసినా గంటలోపే మళ్లీ నిర్వహించేలా ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇండోర్‌ నెట్స్‌ను ఏర్పాటు చేశారు.

34 వేల మంది కూర్చునేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అయితే 2019 నాటికి గ్యాలరీల్లో సీటింగ్‌ ఏర్పాటు పనులు పూర్తి కాలేదు. ఫ్లడ్‌ లైట్లు, సెంట్రలైజ్ ఏసీ పనులు జరగలేదు. స్టేడియంకు రంగులు, ర్యాంపులపై టైల్స్, అంతర్గతంగా విద్యుదీకరణ పనులు, మైదానం బయట డ్రైనేజీ ఏర్పాట్లు, చుట్టూ ప్రహరీ నిర్మాణం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి స్టేడియం నిర్మాణ పనుల్ని ఎక్కడికక్కడే ఆపేశారు. ఫలితంగా కొంత మేర నిర్మాణాలు దెబ్బతిన్నాయి. స్టేడియం పైభాగంలో సిమెంట్ ప్లాస్టరింగ్‌ కూడా చేయకపోవడం వల్ల గోడల్లోకి నీరు చేరుతోంది. అంతర్గతంగా ఉండే ఇనుప చువ్వలు తుప్పుపట్టాయి.

వందపడకల ఆస్పత్రి, అదనపు పోస్టుల భర్తీ - కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు

ఆధునిక హంగులతో అంతర్జాతీయ స్థాయిలో: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీఏ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికయ్యారు. మంగళగిరి క్రికెట్ స్టేడియం అభివృద్ధిపై ఆయన దృష్టి సారించారు. స్టేడియంలో చేపట్టాల్సిన పనులపై నిపుణులతో కమిటీ వేశారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా స్టేడియంలో మార్పులు చేపట్టనున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసేలా చూస్తామని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. పార్కింగ్ కోసం అదనంగా స్థలం సేకరించాల్సి ఉంది. ఆధునిక హంగులతో అంతర్జాతీయ స్థాయికి స్టేడియాన్ని తీర్చిదిద్దుతామని శివనాథ్‌ చెబుతున్నారు.

అన్ని సౌకర్యాలు ఏర్పాటైతే ఇక్కడ రంజీ మ్యాచ్‌లకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాతే బీసీసీఐ బృందం స్టేడియం స్థాయిని తేలుస్తుంది. విశాఖ స్టేడియంకు అంతర్జాతీయ హోదా ఉన్నందున ఇప్పుడు మంగళగిరి మైదానం దాన్ని సాధించాలంటే అంతకన్నా మెరుగ్గా ఉండాలి. పనులు పూర్తయితే మంగళగిరి స్టేడియం అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని క్రీడాభిమానులు చెబుతున్నారు.

"రాజధాని ప్రాంతంలో అన్నీ రాబోతున్నాయి. కాబట్టి స్టేడియం కూడా బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఆ విధంగానే స్టేడియాన్ని రెడీ చేయబోతున్నాము. పూర్తి స్థాయి నివేదిక వచ్చాక దీనిపై నిర్ణయం తీసుకుంటాము". - కేశినేని శివనాథ్, ఏసీఏ అధ్యక్షుడు

మంగళగిరి ఎయిమ్స్​లో మెరుగైన వైద్య సేవలు ​- అతి తక్కువ ఖర్చుతో చికిత్స - Mangalagiri AIIMS

ABOUT THE AUTHOR

...view details