Manoj Complaint to Mohan Babu Versity Incident :బుధవారం నాడు మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద జరిగిన ఘటనపై సినీ నటుడు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. తనతో పాటు, భార్య మోనికపైనా దాడి చేశారని అందులో పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు తమపై దాడికి పాల్పడినట్లు తెలిపారు. సొంత ఇంట్లోకి తనను ఎందుకు అనుమతించట్లేదని మనోజ్ పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో స్పందించిన పోలీసులు శాంతిభద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని ఆయనకు చెప్పారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మనోజ్ తనకు గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తనను అభిమానంగా ప్రేమిస్తున్న వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే తనతో మాట్లాడాలని, తాను ఎక్కడికీ పారిపోవడం లేదన్నారు. చెట్ల వెనక నుంచి తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తన అభిమానులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. తాను ప్రతి సంక్రాంతికి వస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు జరిగిన విషయాలను తాను ఎవరితోనూ చర్చించలేదని మనోజ్ వెల్లడించారు.
"నాతో పాటు భార్య మౌనికపైనా దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారు. నాకు గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదు. ఏదైనా సమస్య ఉంటే నాతో మాట్లాడాలి. నేను ఎక్కడికి పారిపోవడం లేదు. చెట్ల వెనక నుంచి మాపై దాడులు చేస్తున్నారు. నా అభిమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు." - మంచు మనోజ్, సినీ నటుడు