Man Entered into Bank with Petrol Can in Narsipatnam Anakapalli District :అనకాపల్లి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) నర్సీపట్నం శాఖలో ఓ వ్యక్తి మూడు పెట్రోల్ క్యాన్లతో వచ్చి మేనేజర్ క్యాబిన్‌లో చల్లేందుకు ప్రయత్నించడం కలకలం సృష్టించింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అతడ్ని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం రోలుగుంట మండలం జానకిరామపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) సీఈవో బీవీవీవీఎస్‌ఆర్‌జీ రామకృష్ణ మంగళవారం ఉదయం మరో వ్యక్తితో కలిసి మూడు క్యాన్లలో మొత్తం 30 లీటర్ల పెట్రోలుతో బ్యాంకుకు వచ్చారు.
అడ్డుకోబోయిన సిబ్బందిని పక్కకు తోసేసి, ఓ పెట్రోలు క్యాన్‌తో మేనేజరు క్యాబిన్‌లోకి ప్రవేశించారు. మూత తీసి అక్కడున్న సిబ్బందిపై పెట్రోలు పోసేందుకు యత్నించారు. సిబ్బంది పెట్రోలు క్యాన్ లాక్కుని, పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి రామకృష్ణతోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జానకిరామపురం పీఏసీఎస్ సీఈవో రామకృష్ణ, ఉద్యోగులు మడక దేవుడు, సాయి పథకం ప్రకారం పెట్రోలు తీసుకువచ్చి సిబ్బందిని, ఖాతాదారులను భయపెట్టారని వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని మేనేజరు ఎల్‌కేఎన్ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.