New Rules From November 2024 :నవంబర్ మాసం వచ్చేసింది. రోజూ వినియోగించే క్రెడిట్ కార్డులతో పాటు రైలు టికెట్ బుకింగ్ విషయంలో ఐఆర్‌సీటీసీ నయా మార్పులూ నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఇండియన్ బ్యాంక్ తీసుకొచ్చిన ఎఫ్‌డీ సైతం ఈ నెలలోనే కంప్లీట్ కానుంది. ఇలా నవంబర్‌లో వస్తున్న ఆర్థిక మార్పుల వివరాలు ఈ స్టోరీలో మీ కోసం..
ఐసీఐసీఐ బ్యాంక్ భారీ షాక్
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ షాకిచ్చింది. వివిధ క్రెడిట్ కార్డులపై ఇస్తున్నటువంటి రివార్డు పాయింట్లను తగ్గించింది. గ్రాసరీ, డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో చేసే ఖర్చులు, లాంజ్ యాక్సెస్ రివార్డుపై దీని ఎఫెక్ట్ పడనుంది. ఫ్యూయల్ (ఇంధనం) కొనుగోలుపై విధించే సర్‌ఛార్జి రద్దు ఇకపై నెలకు రూ.50 వేల వరకు మాత్రమే వర్తిస్తుంది. థర్డ్ పార్టీ యాప్స్ సాయంతో చేసే ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులపై 1 శాతం అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి.
వాణిజ్య సిలిండర్ ధరకు మళ్లీ రెక్కలు
రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరపై మళ్లీ మోతమోగింది. నేటి (నవంబరు 1) నుంచి ఈ సిలిండర్లపై రూ.62 పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,802కు ఎగబాకింది. 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ ధరను కూడా రూ.15 వరకు పెంచారు. అయితే, ఇంటి అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు వెల్లడించాయి.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ నయా రూల్స్
భారతదేశ అతిపెద్ద బ్యాంకింగ్ నెట్వర్క్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ ఫైనాన్స్ ఛార్జీలను సవరించింది. నెలకు 3.50 శాతంగా ఉన్న మొత్తాన్ని నేటి నుంచి 3.75 శాతానికి పెంచింది. కాగా శౌర్య, డిఫెన్స్ కార్డులను మాత్రం ఈ పెంపు నుంచి మినహాయించింది. అలాగే, ఒక బిల్లింగ్ సైకిల్‌లో చేసే యుటిలిటీ పేమెంట్లు (కరెంట్, గ్యాస్) రూ. 50,000 దాటితే 1 శాతం సర్‌ఛార్జి వసూలు చేయనుంది. ఇవాళ్టి నుంచే ఈ నిబంధన అమల్లోకి రానుంది. మరోవైపు డిసెంబర్ 1 నుంచి యుటిలిటీ బిల్లు మొత్తం రూ.50 వేలు దాటితే బిల్లు మొత్తానికి సర్‌ఛార్జి బ్యాంక్ వసూలు చేయనుంది.