Low Pressure Formed in Bay of Bengal:పశ్చిమ మధ్య – నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే క్రమంగా బలహీనపడనుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల మరో 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, దక్షిణ కోస్తాలో 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. గడిచిన 24 గంటల్లో బొబ్బిలి, పార్వతీపురంలో నాలుగు సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.
ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. పిడుగులు పడే అవకాశముందని వెల్లడించింది. బుధవారం మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. శనివారం తర్వాత రాష్ట్రంలో వర్షాలు తగ్గుతాయి.
పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు: మంగళవారం అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. చలిగాలులు వీచాయి. అల్పపీడనం తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉండడంతో తీరప్రాంత జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కళింగపట్నం, విశాఖపట్నం, తుని, కాకినాడ, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 7 డిగ్రీల మేర తగ్గాయి.