Loksabha Election Result in AP : ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అప్రతిహత విజయం కైవసం చేసుకుంది. 21 లోక్‌సభ స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. పొత్తులో భాగంగా టీడీపీ 17 చోట్ల పోటీ చేసింది. ఒక్క కడప మినహా మిగిలిన అన్నిచోట్లా జెండా ఎగురవేసింది. కాకినాడ, మచిలీపట్నం స్థానాల్లో పోటీ చేసిన జనసేన రెండింటిలోనూ విజయబావుటా ఎగురవేసింది. మరోవైపు పొత్తులో భాగంగా బీజేపీ ఆరు స్థానాల్లో పోటీచేసి అనకాపల్లి, రాజమహేంద్రవరం, నరసాపురం స్థానాలను గెలుచుకుంది. అరకులోయ, తిరుపతి, రాజంపేట స్థానాలను కోల్పోయింది. వైఎస్సార్సీపీ నాలుగు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది. దీంతో 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన వైఎస్సార్సీపీ లోక్ సభ సీట్ల విషయంలో కొంత మెరుగైన ఫలితాలు సాధించినట్లయింది.
శాసనసభ అభ్యర్థులతో పోలిస్తే లోక్‌సభ అభ్యర్ధులకు క్రాస్ ఓటింగ్ జరగడంతో నాలుగు స్థానాలను వైఎస్సార్సీపీ సాధించుకోగలిగింది. 2019 ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్సీపీ ప్రస్తుతం నాలుగింటికే పరిమితం కావాల్సి వచ్చింది. అదే సమయంలో టీడీపీ బలం బాగా పుంజుకుంది. అప్పట్లో మూడు స్థానాలే గెలుచుకున్న టీడీపీ ప్రస్తుతం 16 స్థానాలు పొందింది.
జనాగ్రహానికి నేలకరిచిన నియంత - కుప్పకూలిన జగన్ నిరంకుశ రాజ్యం - YSRCP Defeat In Assembly Elections
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం నుంచి గెలుపొందారు. ఇంతకు ముందు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేశ్ అనకాపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. విజయనగరం నుంచి టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడు ఘన విజయం సాధించారు. విశాఖపట్నం నుంచి మతుకుమిల్లి శ్రీభరత్ 5 లక్షలకు పైగా మెజార్టీతో సత్తా చాటారు.
లోక్‌సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాథుర్ అమలాపురం నుంచి జయభేరి మోగించారు. కాకినాడ నుంచి జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ కుమార్, నరసాపురం నుంచి భూపతి రాజు శ్రీనివాసవర్మ విజయదుందుభి మోగించారు. ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పుట్టా మహేష్ యాదవ్, విజయవాడ నుంచి కేశినేని శివనాథ్ గెలుపొందారు. మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి వరుసగా రెండోసారి సత్తా చాటారు. గుంటూరు నుంచి పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్, బాపట్ల నుంచి పోటీ చేసిన కృష్ణప్రసాద్ విజయం సాధించారు.