New Year Liquor Sales: నూతన సంవత్సర వేడుకలు అంటేనే విందు, వినోదానికి పెట్టింది పేరు. ఇప్పటికే పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో మద్యం విక్రయాల్లో రికార్డులు సృష్టించిన మద్యం ప్రియులు.. తాజాగా మరో మైలురాయి చేరుకున్నారు. గతేడాది 1500కోట్ల విలువైన మద్యం కొనుగోళ్లు జరగ్గా ఈ ఏడాది అందుకు అదనంగా మరో 200 కోట్లు కలుపుకొని 1700కోట్ల విలువైన మద్యం విక్రయాలు నమోదు చేశారు. ఇదంతా కేవలం 7రోజుల్లోనే కావడం గమనార్హం.
నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయాలు సరికొత్త రికార్డు లిఖించాయి. డిసెంబర్ 31కి ముందుగా వారం రోజుల్లో కోట్ల విలువైన సరుకు అమ్ముడుపోయింది. మద్యం డిపోల నుంచి ప్రతి రోజు దాదాపు రూ.200 కోట్ల విలువైన మద్యం సరఫరా అయినట్లు తెలుస్తోంది. ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.3,805 కోట్ల విలువైన 38.07లక్షల లిక్కర్ కేసులు, 45.09లక్షల కేసుల బీర్లు అమ్ముడు పోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకుంటే ఏకంగా రూ.37,682 కోట్ల విలువైన 3.76 కోట్ల లిక్కర్ కేసులు, 5.47 కోట్ల కేసుల బీర్లు విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
నూతన సంవత్సరం వేడుకలు పురస్కరించుకుని మద్యం దుకాణాదారులు పెద్ద ఎత్తున నిల్వ పెట్టుకున్నారు. డిపోల నుంచి భారీ స్థాయిలో సరఫరా చేయడం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 2024 డిసెంబర్ 22వ తేదీ నుంచి 31 వరకు పది రోజుల్లో భారీగా మద్యం సరఫరా అయ్యింది. రెండు ఆదివారాలు, ఒక క్రిస్మస్ మూడు సెలవు రోజులు మినహా మిగిలిన 7 రోజులు డిపోల నుంచి కోట్ల విలువైన మద్యం సరఫరా చేశారు. వారం రోజుల్లో ఏకంగా దాదాపు రూ.1700 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి సరఫరా కావడం గమనార్హం.
వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాల వివరాలు..
- ఈ నెల 23న రూ.193 కోట్లు
- 24వ తేదీన రూ.197 కోట్లు
- 26వ తేదీన రూ.192 కోట్లు
- 27వ తేదీన రూ.187 కోట్లు
- 28వ తేదీన రూ.191 కోట్లు
- 30వ తేదీన రూ. 402 కోట్లు
- 31వ తేదీన రూ.282 కోట్లు