Leopard Found in Dig :అడవిని వీడిన ఓ చిరుత పులి దారి తప్పి జనావాసాల సమీపంలోకి వచ్చింది. ఎటు వెళ్లాలో తెలియక ఖాళీ స్థలంలో తీసి ఉన్న గోతిలో పడిపోయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ దేవనగరం గ్రామంలో పాత పేపరు మిల్లు ఉంది. ఇక్కడ కొన్నాళ్లుగా ఎలాంటి కార్యకలాపాలు కొనసాగడం లేదు. కొందరు మేకల కాపరులు బుధవారం సాయంత్రం ఇటుగా వచ్చారు. ఆ ప్రాంతంలో చిరుత పులి అరుపులు వినిపించడంతో తొలుత భయపడ్డారు.
ధైర్యం చేసి సమీపంలోకి వెళ్లి చూడగా పేపరు మిల్లు స్థలంలోని ఓ గుంతలో చిరుత పులి పడి ఉండటాన్ని గమనించారు.ఈ విషయాన్ని గిద్దలూరు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. సమాచారం అందుకున్న గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ నరసింహరావు, సబ్ డీఎఫ్‌వో శ్రీకాంత్‌రెడ్డి రెస్క్యూ బృందంతో అక్కడికి చేరుకున్నారు. అప్పటికే చీకటి పడడంతో బయటికి తీయడం కష్టమైంది. పులి గుంత నుంచి తప్పించుకోకుండా వలలు ఏర్పాటు చేశారు.
నంద్యాల జిల్లాలో దారుణం - మహిళపై దాడి చేసి చంపేసిన చిరుత - women died leopard attacked
సురక్షితంగా బయటికి తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వనం నుంచి దాహార్తి తీర్చుకునేందుకు చిరుత పులి దేవనగర గ్రామ సమీపంలో స్వామి చెరువుకు వచ్చి ఉండొచ్చని అనంతరం ఇటుగా వచ్చి పేపరు మిల్లు గుంతలో పడి ఉంటుందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న దేవనగర గ్రామస్థులు సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. చిరుత గ్రామ సమీపంలోకి రావడంపై వారంతా ఆందోళన చెందుతున్నారు.