Lavanya From Anantapur Secured 65th Rank in NEET PG :చదువుకోవాలంటే సౌకర్యాలు ఉండాలి. ప్రైవేటు విద్యాసంస్థలో చదివితేనే జీవితాలు మారుతాయనే భ్రమలో కాలం వెళ్లదీస్తుంటారు చాలా మంది. కానీ, ఈ యువతి అలా కాదు. మన పని మనం చేసుకుంటూ పోతే సక్సెస్ అదే వస్తుందని బలంగా నమ్మింది. సాధన చేసి ప్రతిభ చూపింది. ఫలితంగా ఉచిత చదువుతోపాటు జాతీయ స్థాయిలో 65వ ర్యాంకు కైవసం చేసుకుందీ విద్యాకుసుమం.
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన శంకరనారాయణ, మాలతి దంపతుల రెండో కుమార్తె లావణ్య. ఇంట్లో ముగ్గురు ఆడపిల్లే కావడంతో తల్లిదండ్రులు చాలా కష్టాలు పడుతూ పెంచి పోషించారు. వీరికి ఉన్న మూడు ఆవుల ద్వారా వచ్చే పాడి ఆదాయంతోనే కుటుంబం నెట్టుకు వస్తోంది. చిన్నప్పటి నుంచి ఈ కష్టం చూసిన లావణ్య చదువుల్లో రాణించాలని పట్టుదలతో ప్రయత్నాలు మెుదలు పెట్టింది.
పదో తరగతి ఫలితాల్లో 9.5 శాతం మార్కులు సాధించింది లావణ్య. చదువులో ప్రతిభ కనబరిచిన తనకు ఇంటర్ చదివించడానికి అనంతపురానికి చెందిన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు ముందుకు వచ్చింది. ఆర్థిక సహాయం చేసి విజయవాడలోని కార్పొరేట్ జూనియర్ కళాశాలలో బైపీసీ కోర్సులో చేర్పించారు. తన ఎదుగుదలకు తలిదండ్రుల కష్టంతోపాటు ఆర్డీటీ సహాయం తోడైందని లావణ్య చెబుతోంది.
సాధించాలనే పట్టుదల అందుకు తగ్గ ప్రోత్సాహం తోడవ్వడంతో ఇంటర్‌లో 981 మార్కులు సాధించింది లావణ్య. సాధారణంగా RDT సంస్థ ఎవరికైనా ఇంటర్ విద్య వరకే సహాయం చేస్తుంది. అయితే లావణ్య ప్రతిభ, కుటుంబం పరిస్థితి చూసి నిబంధనలు మార్చుకోవడం ద్వారా తన చదువుకు అండగా నిలిచింది ఆ సంస్థ. ఫలితంగా నీట్ పోటీ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించింది. నీట్ ర్యాంకుతో కడప రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎలస్ చదివింది ఈ విద్యాకుసుమం.