ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫిబ్రవరి 1 నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు: మంత్రి అనగాని - LAND REGISTRATION VALUE TO INCREASE

రిజిస్ట్రేషన్‌ విలువలు 15 నుంచి 20 శాతం వరకు పెంచుతున్నట్లు వెల్లడించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ - జనవరి 15 నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం

Registration_Value_Increase
Land registration Value to Increase (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2024, 8:45 PM IST

Land registration Value to Increase: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏఏ ప్రాంతంలో ఎంతెంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి 15వ తేదీ కల్లా ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖపై తాడేపల్లి ఐజీ కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు.

గతంలో పెంచిన విలువలను సరిచేస్తాం:గత ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పుల భారం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకోంటోందని, అయితే రాష్ట్రానికి రెవెన్యూ కూడా అవసరమని, ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో, ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతామని చెప్పారు. గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువల పెంపును శాస్త్రీయ పద్ధతిలో కాకుండా ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్లిందని, దీంతో చాలా చోట్ల భూమి విలువల కంటే రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా ఉన్నాయని తమ పరిశీలనలో తేలిందన్నారు.

ఏపీ ప్రజలకు అలర్ట్ - జనవరి​ 1 నుంచి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు!

అటువంటి అన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలను తగ్గిస్తామని చెప్పారు. ఇలా విలువలు తగ్గించడం చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పారు. విలువలు పెరిగే చోట సగటున 15 శాతం నుంచి 20 శాతం వరకు పెంపుదల ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖలోనే వస్తుండగా, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోనూ 10 శాతం వరకు గ్రీవెన్స్ వస్తున్నాయని చెప్పారు. వీటిన్నింటినీ పరిష్కరించే దిశగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత ఏడాదితో పోల్చితే గత ఆరు నెలల్లో ఒక్క సెప్టెంబర్ మాసంలో తప్ప మిగిలిన అన్ని నెలల్లోనూ అదనపు ఆదాయమే వచ్చిందన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి తాము టార్గెట్​గా పెట్టుకున్న 9,500 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంటామని చెప్పారు.

గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి తన స్వార్ధం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులను చాలా ఇబ్బందులు పెట్టారని, కానీ తమ ప్రభుత్వం వారితో స్నేహపూర్వకంగా ఉంటూ సమస్యలన్నీ పరిష్కరిస్తుందని చెప్పారు. భూ వివాదాలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, ఇప్పటికి లక్షా 70 వేల ఫిర్యాదులు రాగా 11 వేల ఫిర్యాదులను అక్కడిక్కడే పరిష్కరించినట్లు చెప్పారు. అయితే ఇలా పరిష్కరించిన సమస్యలను ముందుగానే ఎందుకు చేపట్టలేదంటూ సంబంధిత అధికారులను కూడా ప్రశ్నిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. విలేకరుల సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్​తోపాటు రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోదియా, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ శేషగిరిబాబు కూడా పాల్గొన్నారు.

అక్కడ వాహనం కొని ఇక్కడ రిజిస్ట్రేషన్​ - ఇకపై ఏపీలో అలా కుదరదు

ABOUT THE AUTHOR

...view details