Roads Damaged in Nandyal District : పేరు గొప్ప ఊరు దిబ్బగా తయారైంది కర్నూలు - గుంటూరు జాతీయ రహదారి పరిస్థితి. నిత్యం వేలాది మంది భక్తులు, ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రోడ్డు అడుగుకో గుంతతో వాహనాలకు ఆహ్వానం పలుకుతోంది. అధ్వానంగా తయారైన రహదారిపై ప్రయాణమంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. నరకదారిలో నిత్యం వాహనాలు మరమ్మతులకు గురై ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు-గుంటూరు రోడ్డును కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి- 340సీగా గుర్తించింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి ప్రకాశం జిల్లా దోర్నాల మధ్య ఈ రహదారి 58 కిలోమీటర్లు ఉండగా అందులో 40 కిలో మీటర్లు నల్లమల అటవీ ప్రాంతంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఘాట్‌రోడ్డులో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని డ్రైవర్లు వివరిస్తున్నారు. వెంకటాపురం- రోళ్లపెంట మధ్య ఇదే పరిస్థితి నెలకొంది.
Kurnool - Guntur NH Damaged :దోర్నాల మండలం కొర్రప్రోలు వరకు, బైర్లూటి- రామయ్యకుంట మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఫలితంగా వాహనాలు కిందికి దిగలేని పరిస్థితి నెలకొంది. రోళ్లపెంట సమీపంలో కిలోమీటరు మేర గుంతలు ఏర్పడ్డాయి. నల్లమడుగులపెంట గేట్ కుదుపు రస్తా వరకు ఇలానే ఉంది. వెంకటాపురం- సంజీవనగర్‌తండా మధ్య పల్లెకట్ల సమీపంలో పెద్ద గుంత ప్రమాదకరంగా మారింది. తాత్కాలికంగా వేసిన కంకర రాళ్లు ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయాయి.