Fire Accident at Visakha Railway Station Today : విశాఖ రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాలుగో నంబర్ ప్లాట్ ఫారంపై నిలిపి ఉన్న కోర్బా - విశాఖ ఎక్స్‌ప్రెస్‌లోని మూడు ఏసీ బోగీల్లో మంటలు చేలరేగాయి. తొలుత బీ-7 బోగీలో చేలరేగిన మంటలు క్రమంగా బీ-6, ఎం-1 బోగీలకు వ్యాపించాయి. ఇది గమనించిన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీనిపై అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు.
Korba Express Fire Accident Updates :ఈ ఘటనలో మూడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. కోర్బా నుంచి ఉదయం ఆరు గంటలకు రైలు విశాఖకు వచ్చిందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి వెళ్లాల్సి ఉందన్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని భావిస్తున్నట్లు వెల్లడించారు. దగ్ధమైన బోగీలను రైలు నుంచి విడదీసి పంపేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.