Komuravelli Mallanna Pedda Patnam 2024 :సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగామహాశివరాత్రిని పురస్కరించుకుని తెల్లవారుజామున స్వామివారి పెద్దపట్నం కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందుగా గర్భాలయంలో లింగోద్భవ కాలంలో స్వామివారికి మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను కొమురవెల్లి పురవీధుల్లో భక్తుల జయజయ ధ్వానాల నడుమ ఊరేగించారు. తదుపరి తోట బావి వద్ద పెద్ద పట్నం కార్యక్రమాన్ని నిర్వహించారు.
కోలాహలంగా సాగిన పెద్దపట్నం : సుమారు మూడు గంటలకు పైగా ఒగ్గు కళాకారులు పంచ వర్ణాలతో పెద్ద పట్నాన్ని వేశారు. రాత్రంతా శివనామస్మరణతో జాగారాలు చేసిన భక్తులు పెద్ద పట్నాన్ని తొక్కేందుకు ఉత్సాహం కనబరిచారు. ముందుగా ఆలయ పూజారులు ఉత్సవ విగ్రహాలను తీసుకొని పట్నం దాటారు. అనంతరం భక్తులకు అనుమతించడంతో ఒక్కసారిగా పట్నంలోకి దూసుకొచ్చారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపటి వరకు తోపులాట జరిగింది. అప్రమత్తమైన పోలీసులు వారి లాఠీలకు పని చెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం భక్తులను క్రమ పద్ధతిలో పంపించారు. పట్నం దాటుతూ బండారు తీసుకెళ్లేందుకు భక్తులు పోటీ పడ్డారు.
Pedda Patnam in Komuravelli on Mahashivratri : కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి ఏటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. మూడు నెలల పాటు జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. సంక్రాంతి తరువాత వచ్చే మొదటి ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు ఉగాది వరకు భక్తి శ్రద్ధలతో కొనసాగుతాయి.