Komuravelli Mallikarjuna Swamy Temple : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లిలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం (జనవరి 19) వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తుంది. జనవరి 19 మొదలైన ఈ ఉత్సవాలు దాదాపు రెండున్నర నెలల పాటు జరుగనున్నాయి. ఉగాది పండగకు ముందు వచ్చే ఆదివారం రోజు అర్ధరాత్రి తర్వాత నిర్వహించే అగ్నిగుండం కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
అద్భుతంగా పట్నం వారం : ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటి వారాన్ని 'పట్నం వారం'గా పిలుస్తారు. శనివారం (జనవరి 18న) సాయంత్రమే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మల్లికార్జునస్వామిని ధూళి దర్శనం చేసుకున్నారు. ఆదివారం నైవేద్యం వండి, పాత్రలను సుందరంగా అలంకరించి, పూనకాలతో ఊగిపోతూ ఆ దైవం మల్లన్నకు, గుట్టపై ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఆదివారం ఒక్క రోజే సుమారు 70 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఎండోమెంట్ ఆఫీసర్ రామాంజనేయులు తెలిపారు. సోమవారం (జనవరి 20న) ‘పట్నం-అగ్నిగుండం’ కార్యక్రమాలను హైదరాబాద్ భక్తులు సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు.
ప్రతి ఆదివారం విశేష కార్యక్రమం : కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రతి ఆదివారం విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీంతో ఆదివారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులు బోనాలతో సంతోషంగా ఆలయానికి వెళ్లి మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. పట్నం వేసి కల్యాణం జరిపించి తమ మొక్కులను తీర్చుకుంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు.