Kidney Patients Facing Problems in Srikakulam GGH : కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం నిర్వహించే డయాలసిస్ కేంద్రాలు నిర్వహణ లోపంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. డయాలసిస్ రోగులు ఊపిరి తీసుకోవడానికి ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఏసీలు, ఫ్యాన్లు పని చేయకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. మరోవైపు సిబ్బంది తీరుతో రోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంజక్షన్ల నిల్వలు ఉన్నప్పటికీ డయాలసిస్ రోగులే ఇంజక్షన్లు కొంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. సిక్కోలు జీజీహెచ్ లో ఉన్న డయాలసిస్ కేంద్రంలో రోగులు పడుతున్న ఇబ్బందులపై 'ఈటీవీ భారత్ - ఈనాడు' పరిశీలనలో అనేక వాస్తవాలు బయటపడ్డాయి.
అక్కడి వెళ్తే కొత్త రోగాలు! ఆందోళనలో బాధితులు - Patients problems in nellore GGH
సిక్కోలు జీజీహెచ్ డయాలసిస్ కేంద్రంలో నిర్వహణ లోపం :శ్రీకాకుళం జిల్లాకే పెద్దదిక్కైన ప్రభుత్వ సర్వజనాసుపత్రిలోని డయాలసిస్ కేంద్రం నిర్వహణ లోపంతో రోగులు అవస్థలు పడుతున్నారు. కిడ్నీలు పాడైన వ్యక్తికి డయాలసిస్ చేసేటపుడు నాలుగు గంటలు సంబంధిత యంత్రాల వద్ద ఉండాలి. కానీ ఇక్కడ ఏసీలు, ఫ్యాన్లు పనిచేయక ఉక్కపోతను భరిస్తూనే రోగులు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. ఆసుపత్రి అధికారులు, డయాలసిస్ కేంద్రం నిర్వహిస్తున్న నెఫ్రోప్లస్ సిబ్బందికి సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్టాక్ ఉన్నా ఇంజక్షన్లను బైట నుంచి తెచ్చుకోమంటున్న సిబ్బంది :ఈ డయాలసిస్ విభాగంలో 19 డయాలసిస్ చేసే యంత్రాలు ఉన్నాయి. రోజుకి 60 మందికి పైబడి డయాలసిస్ చేస్తుంటారు. అయితే డయాలసిస్ కేంద్రం సిబ్బంది తీరుతో రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రక్తవృద్ధి కోసం రోగులకు ఎరిత్రోపాటిన్ ఇంజక్షన్లు సర్వజనాసుపత్రిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్సు నుంచి తెప్పించి నెఫ్రోప్లస్ సిబ్బంది ఉచితంగా ఇవ్వాలి. కానీ వాస్తవానికి నెఫ్రోప్లస్ సిబ్బంది అసలు ఇండెంట్ పెట్టలేదు. డయాలసిస్ కోసం వచ్చే తమతో మూడు నెలలుగా రూ.1,936 రూపాయల ఖరీదు చేసే ఇంజక్షన్ కొనిపిస్తున్నారని రోగులు వాపోయారు. ఉచితంగా ఇవ్వాల్సిన ఇంజక్షన్లను కొనమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
నేను మూడు నెలలుగా ఆసుపత్రికి వస్తున్నాను. ప్రతిసారి ఇంజెక్షన్ బయటే కొంటున్నాను. పేదలకు ఇంత ఖరీదైనా ఇంజెక్షన్ కొనడం ఎలా సాధ్యం. ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ఇవ్వడం లేదని తెలిసింది. ఇది సరి కాదు. -టి.శ్రీనివాసరావు, గార