ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల శుచి, శుభ్రత కరవు - కీలక విషయాలు వెల్లడించిన కేంద్ర హోంశాఖ కమిటీ - Food Safety Standards in TTD - FOOD SAFETY STANDARDS IN TTD

Food Safety Standards in Tirumala: తిరుమల దివ్యక్షేత్రంలో భక్తులకు తితిదే అందిస్తున్న అన్న పానీయాల్లో శుచి, శుభ్రత కరువైనట్లు కేంద్ర హోంశాఖ నిపుణుల అధ్యయనంలో తేలింది. చట్టం ప్రకారం లేబుళ్లూ లేవు. పరీక్షించే ప్రయోగశాలల్లో సౌకర్యాలు కరవు, వంటశాలలు అపరిశుభ్రం, వండే వారి ఆరోగ్య రికార్డులూ లేవని తెలిసింది.

Food Safety Standards in Tirumala
Food Safety Standards in Tirumala (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 2, 2024, 9:55 PM IST

Food Safety Standards in Tirumala: అన్న పానీయాల్లో నాణ్యత, తాగునీటిలో పీహెచ్‌ స్థాయి తగినంత లేదు. ఆహారభద్రత ప్రమాణాలకూ దూరంగా పదార్థాలు సరఫరా అవుతున్నాయి. టెండర్లలోనే ఆ నియమాలేవీ తిరుమల తిరుపతి దేవస్థానం పొందుపరచలేదు. చట్టం ప్రకారం లేబుళ్లూ లేవు. పరీక్షించే ప్రయోగశాలల్లో సౌకర్యాలు కరవు, వంటశాలలు అపరిశుభ్రం, వండే వారి ఆరోగ్య రికార్డులూ లేని వైనం. కేంద్ర హోంశాఖ నియమించిన కమిటీ తిరుమలలో కూలంకుషంగా చేసిన అధ్యయనంలోనే ఈ లోపాలు వెలుగు చూశాయి.

తిరుమల దివ్యక్షేత్రంలో భక్తులకు తి.తి.దే. అందిస్తున్న అన్న పానీయాల్లో శుచి, శుభ్రత లేదు. జలప్రసాదం నీళ్లలో ప్రమాణాలు లేవు. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అందించే ఆహారంలోనూ శుచి, శుభ్రత, నాణ్యత కానరావు. భక్తుల ఆరోగ్య, ప్రాణాలను తి.తి.దే. పణంగా పెడుతోంది. ఇదేదో సాదాసీదా వ్యక్తులు చెబుతున్న విషయాలు, ఆరోపణలు కావు. సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ నిపుణుల అధ్యయనంలో తేలిన అంశాలు. 2023 జూన్, జులై నెలల్లో ఈ అధ్యయనం జరిగింది. తిరుమల మొత్తానికి నీళ్లందించే జలాశయాలను అధ్యయన బృందం సందర్శించింది. అక్కడి నీళ్లు కాస్త ఊదా రంగు నుంచి ఎరుపు రంగులో ఉన్నట్లు చెప్పింది. ఆ నీళ్లలో ఇనుము అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. పాండవతీర్థంలో డ్యాం నుంచి లీకవుతున్న నీళ్లతో ఆ ప్రాంతం నిండిపోయిందని, అదే నీరు ఫిల్టర్‌హౌస్‌కు సరఫరా అవుతోందని గుర్తించారు. వేలమంది భక్తులకు నీళ్లందించే ఆ ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టలేదని తెలిపింది. ఈ పరిస్థితుల వల్ల ఆ నీళ్లలో ఎవరైనా హానికర పదార్థాలు కలిపే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని ప్రస్తావించింది. తిరుమల భక్తులకు ఏ జలాశయాల నుంచి నీళ్లను అందిస్తున్నారో అక్కడ చనిపోయిన చెట్లు, మృత సేంద్రియ పదార్థాలు ఆ నీళ్లలో కలుస్తున్నాయని అధ్యయన బృందం చెప్పింది.

తిరుమలలో ఇప్పటికీ 1968లో నిర్మించిన నీటి ఫిల్టర్‌హౌస్‌నే వినియోగిస్తున్నారు. నీటిశుద్ధి ప్రమాణాలను ఇక్కడ పాటించడం లేదు. మేదరమిట్ట, రాంబగీచా, లేపాక్షి ప్రాంతాల్లో భక్తులకు జలప్రసాదం అందిస్తున్నారు. అక్కడా పారిశుద్ధ్య పరిస్థితులు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. ఆ జలప్రసాదానికి సమీపంలోనే నీటి డ్రెయిన్లు ఉండటంతో అక్కడ కీటకాలు, పురుగులు ఉంటున్నాయి. తగిన పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయలేదు. జలప్రసాదంలో ఇచ్చే నీళ్లు ఆరోగ్యానికి అనువైనవిగా లేవని తేలింది. అలాంటి నీరు ఆరోగ్యానికి మంచిదికాదని ప్రమాణాలు చెప్తున్నాయి. తిరుమలలో ఏర్పాటు చేసిన నీటి, ఆహార పరీక్షల లేబొరేటరీ అంతంతమాత్రంగా ఉంది. తి.తి.దే.లో ఆహార తయారీ, ఆహారాలు నిల్వచేసే గోడౌన్లు, వంటలు వండే వంటశాలల వరకూ అన్నిచోట్లా లోపాలే. వంటకు వినియోగించే పదార్థాల ప్రమాణాలకు గ్యారంటీ లేదు. తిరుమలకు అవసరమైన ఆహారం సరఫరా చేసేందుకు పిలిచిన టెండర్లలో ఆహార నాణ్యత, నియమాలు పాటించే నిబంధనలు లేవని తేలింది.
టీటీడీ గుడ్ న్యూస్ - ఉచితంగా కారు సాకర్యంతో స్వామి దర్శనం- వారికి మాత్రమే! - Free Darshan for Senior Citizens

ఆహారభద్రత చట్టం నియమాలను సరఫరాదారులు పాటించాలనే టెండరు నిబంధనను తి.తి.దే. అమలు చేయడం లేదని అధ్యయనంలో తేలింది. ఒక్క సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ తప్ప ఏ ఇతర ఆహార పదార్థాలకు సంబంధించి 2011 ఆహార నాణ్యత నియంత్రణ లేబుల్స్‌ అక్కడ కనిపించలేదని కమిటీ తేల్చింది. ఓ గోడౌన్‌లో పరిశుభ్రతా చర్యలు లేవు. సీలింగు, గోడల వద్ద సాలెపురుగులు కనిపించాయి. ఈ గోడౌన్‌లో పనిచేస్తున్న లేదా ఈ పదార్థాల రవాణా, ఇతర వ్యవహారాలతో సంబంధం ఉన్న సిబ్బంది ఆరోగ్య రికార్డులూ లేవు. అక్కడ కోల్డ్‌స్టోరేజి వివరాలు ఏమీ లేవు. కందిపప్పు, శనగపప్పుల వినియోగానికి నిర్దేశించిన ఆహారభద్రత నియమాలు ఏవీ టెండర్‌ డాక్యుమెంట్లలో ప్రస్తావించిన దాఖలాలు లేవు. చెదలు, ఇతర పురుగులు పట్టకుండా అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదు. వీటిపై గోడౌన్‌లో రికార్డులు లేవు. ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లేబుల్‌ ఆహారపదార్థాలపై ఉండటం లేదు. ఉప్పు, మిర్చి పొడి ఎవరు తయారుచేశారనే సమాచారం ప్యాకెట్ల మీద లేదు. వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. వంట చేసే మహిళలు, వారికి సహకరించే సిబ్బంది తలలకు టోపీలు ధరించడం లేదు.

టీటీడీ పత్రాలు, కంప్యూటర్ల ధ్వంసానికి కుట్ర- ధర్మారెడ్డి జైలుకెళ్లడం ఖాయం: ఆనం - TDP Leader Anam Fires on YSRCP

ABOUT THE AUTHOR

...view details