Corrupt officer in Agriculture Dept : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పేషీలో ఆయనో కీలక అధికారి. కార్యాలయానికి ఎవరు, ఏ పనిపై వచ్చినా ‘సాయంత్రం 5:30 తర్వాత సార్ ఇంటి వద్దకు రండి’ అనే సంకేతాలు ఇస్తారు. అక్కడికి వచ్చాక పని పూర్తి కావాలంటే ఎంత ఖర్చవుతుందో ఓ నంబర్ చెబుతారు. బదిలీ చేయించాలన్నా, పోస్టింగ్ కావాలన్నా, పదోన్నతి కల్పించాలన్నా సరే, ప్రతి పైరవీకి అతని దగ్గర ఓ లెక్క ఉంటుంది. అది నిబంధనలకు అతీతంగా ఉన్నా, అనుగుణంగా ఉన్నా ఆ లెక్కకు సరిపోలితే చాలు. మరి దాని వంక చూసే పనిలేదు.
సస్పెండైన వారైనా, కేసుల్లో ఉన్న వారైనా అడిగినంతా సమర్పించుకుంటే సరే ఫైల్ కదులుతుంది. లేదంటే మంత్రి సంతకమైనా వారాలు, నెలలు తరబడి ఆగిపోతుంది. వచ్చింది ఎవరు? పని ఏంటనేది కాదు అక్కడ సాయంత్రానికి కలెక్షన్ ఎంతొచ్చిందనేదే ముఖ్యం. భయమూబెదరూ లేకుండా అవినీతి సేద్యం చేస్తున్న ఆ అధికారి తీరు చూసి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు తెల్లబోతున్నారు. ఆయన రోజువారీ వసూళ్లు రూ.20 లక్షలకు పైమాటే అని ఇంతటి దోపిడీని దేనితోనూ పోల్చి చూడలేమని వాపోతున్నారు.
ఈ అధికారి వైఎస్సార్సీపీ పాలనలోనూ ఓ మంత్రి వద్ద పనిచేశారు. అప్పట్లోనూ పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయినా ఏరికోరి మరీ ప్రత్యేకంగా ఆ అధికారినే పేషీలో నియమించుకోవడం గమనార్హం. ఆయన పేరు చెబితే వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులే కాక కిందిస్థాయి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, వివిధ పనులపై వచ్చే కంపెనీల ప్రతినిధులు భయపడుతున్నారు.
చేపపిల్లలైనా - చిరుద్యోగులైనా :ఈ అధికారి వ్యవసాయ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే వారిని కూడా వదలకుండా పిండేస్తున్నారు. జీతాల విడుదలకు సంబంధించిన ఫైల్ కదల్చడానికి చిరుద్యోగులు తమ కష్టార్జితాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. మూడునెలల కిందట పశు సంవర్ధక శాఖలో పదోన్నతులు కల్పించగా ఇందులోనూ భారీగా వసూలు చేశారు. సహకార శాఖలోనూ పదోన్నతుల్లో ముడుపులు ముట్టాయి.