Sabarimala Police Guide :అయ్యప్ప మాల ధరించి శబరిమల వచ్చే భక్తులకు కేరళ పోలీసులు శుభవార్త చెప్పారు. మండలం-మకరవిళక్కు వార్షిక యాత్ర సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారు సులభంగా దర్శించుకొనేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్‌ను ప్రవేశపెట్టారు. శబరిమల యాత్రలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేరళ పోలీసులు పోలీస్ గైడ్ అనే పోర్టల్ ప్రవేశపెట్టారు. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వచ్చే భక్తులకు పూర్తి సమాచారంతో ఈ పోర్టల్‌ను అందుబాటులో ఉంచారు.
ఇందులో శబరిమల చరిత్రతో పాటు వాహనాల పార్కింగ్, అంబులెన్స్ సేవల సమాచారం కూడా ఉంది. శబరిమల-పోలీస్ గైడ్ (Sabarimala-Police Guide) అనే ఈ పోర్టల్ ఆంగ్లంలో అందుబాటులో ఉంది. భక్తులకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారాన్నంతా కేరళ పోలీసులు ఈ పోర్టల్‌లో పొందుపరిచారు. పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లు, పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్లు, ఆరోగ్య సేవలు, కేఎస్‌ఆర్టీసీ, అంబులెన్సు, అగ్నిమాపక దళం, ఫుడ్ సేఫ్టీకి చెందిన సమాచారాన్ని పొందుపరిచారు.
వీటితోపాటు శబరిమల చరిత్ర, వాహనాల పార్కింగ్, ప్రతి జిల్లా నుంచి శబరిమల వరకు వాయు, రైలు, రోడ్డు మార్గాల వివరాలను Sabarimala-Police Guideలో పొందుపరిచినట్లు పోలీసు అధికారులు తెలిపారు.