తెలంగాణ

telangana

కానిస్టేబుల్​ కిష్టయ్య కుమార్తె చదువుకు మరోసారి కేసీఆర్ సాయం - రూ.24 లక్షల చెక్కు అందజేత - KCR help to Martyr Constable family

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 7:28 PM IST

KCR Helps Constable Kistaiah Daughter : రాష్ట్ర సాధన కోసం ప్రాణార్పణ చేసిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి సహాయం చేశారు. కిష్టయ్య కుమార్తె పీజీ వైద్యవిద్య కోసం అవసరమైన రూ.24 లక్షల చెక్కును కేసీఆర్ అందజేశారు. తమ కుటుంబాన్ని ఇంటి పెద్దలా ఆదుకుంటున్న కేసీఆర్​కు కిష్టయ్య కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.

KCR Helps Constable Kistaiah Daughter
KCR Helps Constable Kistaiah Daughter (ETV Bharat)

KCR Helps Constable Kistaiah Daughter :తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోమారు అండగా నిలిచారు. కిష్టయ్య కుమార్తె ఎంబీబీఎస్ విద్య కోసం గతంలో ఆర్థికసాయం చేసిన ఆయన పీజీ వైద్యవిద్య కోసం అవసరమైన సాయాన్ని కూడా అందించారు. ఈ మేరకు రూ.24 లక్షల చెక్కును కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందించారు.

KCR help to Martyr Constable family :కుటుంబపెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి తాను అండగా నిలుస్తానని బీఆర్ఎస్ అధినేత ఉద్యమ సమయంలో హామీ ఇచ్చారు. కిష్టయ్య పిల్లల చదువు సహా ప్రతి కష్టకాలంలో అండగా నిలుస్తూ వచ్చారు. కిష్టయ్య కుమార్తె పీజీ వైద్యవిద్య కోసం ఇవాళ చెక్ అందించి తన నివాసంలో వారితో కలిసి భోజనం చేశారు. కుటుంబ కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

తల్లికి ఏ కష్టం రాకుండా చూసుకోండి :రాష్ట్రం కోసం కిష్టయ్య ప్రాణత్యాగం చేసినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న వారిని తల్లి ఎంతో కష్టపడి సాదుకొని చదివించిందన్న కేసీఆర్ వారు ఇప్పుడు ప్రయోజకులయ్యారని అన్నారు. తల్లికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని, ఏ సమయంలో నైనా తన సహకారం ఉంటుందని తెలిపారు. తమ కుటుంబాన్ని ఇంటి పెద్దలా ఆదుకుంటున్న కేసీఆర్​కు కిష్టయ్య కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.

తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరులను తమ ప్రభుత్వంలో ఆదుకున్నామని అదే స్ఫూర్తిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని కేసీఆర్ అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి పదేళ్లు పూర్తయిందని తన భర్త చనిపోయి 15 ఏళ్లు గడిచిపోయిందని పోలీసు కిష్టయ్య భార్య పద్మావతి తెలిపారు. చిన్నపిల్లలతో తండ్రి లాంటి కేసీఆర్ దగ్గరకు వెళ్తే అండగా ఉంటానని ఆనాడు హామీ ఇచ్చారని, అందుకు అనుగుణంగానే అప్పటి నుంచి అన్ని విధాలా ఆసరా అందిస్తున్నారని చెప్పారు.

కేసీఆర్​ అన్ని విధాల మాకు అండగా నిలిచారు :తమకు ఊహ తెలియని సమయంలోనే తండ్రి ప్రాణత్యాగం చేశారని నాడు హామీ ఇచ్చినట్లే కేసీఆర్ అన్ని విధాలా అండగా ఉన్నారని కిష్టయ్య కుమారుడు రాహుల్ తెలిపారు. తమను కంటికి రెప్పలా చూసుకుంటున్న తమ తల్లికి ఒక తండ్రిలా కేసీఆర్ అన్ని విధాలా అండగా ఉన్నారని చెప్పారు. తన తండ్రి కిష్టయ్య కల నెరవేరిందని, ఆయన తమ మధ్య లేకపోవడం బాధగా ఉందని రాహుల్ ఆవేదనకు లోనయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందని, తన తండ్రి జీవించి ఉంటే ఇంకా బాగుండేదని రాహుల్ తెలిపారు.

Constable Kistaiah Daughter : తండ్రి ఆశయం.. కేసీఆర్ సాయం.. ఆమెను డాక్టర్‌ను చేసింది

కేసీఆర్‌ సాబ్‌.. మీ సాయానికి మేం ఫిదా

ABOUT THE AUTHOR

...view details