Karthika Pournami Celebrations: కార్తిక పౌర్ణమి సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. ఆలయంలో సుమారు 9 వేల వ్రతాలు జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగించి గిరిప్రదక్షిణ ప్రారంభించారు. వేడుకల్లో భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
KARTHIKA POURNAMI IN SIVA TEMPLES: కార్తిక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో గిరిప్రదక్షిణ పూజలు ఘనంగా జరిగాయి. పరమేశ్వరుడ్ని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని నీలకంఠేశ్వరుని ఆలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. శ్రీశైలంలో వైభవంగా కార్తిక పౌర్ణమి వేడుకలు జరిగాయి. కృష్ణవేణి నదీమ తల్లికి పూజలు చేసి అర్చకులు హారతులు ఇచ్చారు. ఆలయం ముందు గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం నిర్వహించారు. కాగడాలతో తోరణ వత్తులను ఈవో దంపతులు వెలిగించారు. జ్వాలాతోరణోత్సవాన్ని వేలాది భక్తులు తిలకించారు.
కార్తిక పౌర్ణమి వేళ పంచరామాల్లో ప్రధమ క్షేత్రం అమరావతి అమరేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. హరహర మహాదేవ శంభో శంకరా అంటూ భక్త జనం శివుని దర్శనానికి పోటెత్తారు. జ్యోతి స్వరూపుడైన ఓంకారేశ్వరుడికి ప్రణమిల్లి కార్తీక దీపాలతో పూజలు చేశారు. జ్వాలతోరణాలతో పరమేశ్వరుడిని ఆరాధించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద ఈవో కేఎస్ రామరావు దంపతులు, వేద పండితులు ప్రారంభించిన గిరిప్రదక్షిణ వైభవంగా సాగింది. అనంతపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ శివ క్షేత్రాల్లో స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. నంద్యాల నవ నందుల ఆలయాన్ని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి దర్శించుకున్నారు.