Karthika Deepotsavam Organized by ETV in Guntur:పవిత్ర కార్తిక మాసం సందర్భంగా ఈటీవీ నిర్వహిస్తున్న దీపోత్సవం గుంటూరు నగరంలో వైభవంగా జరిగింది. జేకేసీ కళాశాల రోడ్డులోని డాక్టర్ కేఎల్‌పీ స్కూల్ మైదానంలో నిర్వహించిన దీపోత్సవానికి మహిళా లోకం భారీగా తరలివచ్చింది. కార్తిక పౌర్ణమి కూడా కలిసి రావటంతో దీపోత్సవ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళల భక్తులు హాజరయ్యారు. పవిత్ర కార్తిక మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో ఈటీవీ లైఫ్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానెళ్లు సంయుక్తంగా నిర్వహించిన కార్తిక దీపోత్సవానికి మహిళలు సంప్రదాయ దుస్తుల్లో తరలివచ్చారు.
తొలుత పాడుతా తీయగా గాయకులు ఆలపించిన భక్తి గీతాలు అందరిని పారవశ్యంలో ముంచెత్తాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, ప్రవచనకర్తల ఆధ్యాత్మిక ప్రసంగాలతో కార్యక్రమం అసాంతం భక్తి భావనతో సాగింది. కార్తిక మాస విశిష్టత, దీపారాధన ప్రాధమ్యాలను వివరించారు. పురాణగాథలు అందరూ శ్రద్ధగా ఆలకించారు. పరమ శివుని స్తోత్రాల నేపథ్యంలో కీలక ఘట్టమైన సామూహిక దీపారాధనను చేసిన మహిళల శివనాస్మరణతో గుంటూరు మార్మోగింది.
గుంటూరులో కార్తిక దీపోత్సవం - దీపాలతో ఆధ్యాత్మికంగా వెల్లివిరిసిన మైదానం (ETV Bharat) ఏడాదికి ఒక్కసారే దర్శనం - కార్తిక పౌర్ణమి నాడు రుద్రాభిషేకం
కూటమి ప్రభుత్వంలో చీకట్లన్నీ తొలగిపోవాలి:రాజకీయ, సాంస్కృతిక, కళా చైతన్యానికి కేంద్రమైన గుంటూరులో చాలా కాలం తరువాత కార్తిక పౌర్ణమి రోజున వందలాది మంది కార్తిక దీపోత్సవంలో పాల్గొన్నారు. కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి ఉపవాసం ఉన్న మహిళా భక్తులు సాయంత్రం పున్నమి వెలుగుల్లో, దీపకాంతుల్లో ఆ శివకేశవుల్ని స్మరించుకున్నారు. గత ఐదేళ్లుగా అంధకారం అలుముకుని, రాష్ట్రంతో పాటు గుంటూరులోనూ అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వంలో ఆ చీకట్లన్నీ తొలగిపోయి ప్రగతి పథంలో సాగేందుకు ఈ దీపోత్సవం నాంది పలకాలని ప్రజా ప్రతినిధులు ఆకాంక్షించారు. లోకమంతా మంచి జరగాలని, అందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలనే తలంపుతో ఈ దీపోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
భక్తులు హర్షం వ్యక్తం:కార్తిక పౌర్ణమి ప్రత్యేకత, సామూహిక దీపోత్సవ విశిష్టతను తెలియజేస్తూ బ్రహ్మశ్రీ ధూళిపాళ్ల శివరామకృష్ణ శర్మ ప్రవచనం వినిపించారు. కార్యక్రమానికి సంబంధించి పాసులు పొందిన వారు సాయంత్రం 5గంటల నుంచే మైదానానికి చేరుకున్నారు. కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు నిర్వాహకులే పూజాసామాగ్రి అందజేశారు. స్వార్ధాన్ని వీడి సమాజంలో అందరితో కలిసి మెలిసి సంతోషంగా, సౌభాగ్యంగా ఉండాలనే చక్కటి సందేశంతో ఈటీవీ దీపోత్సవం నిర్వహించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో ఆధ్యాత్మిక శోభను వెదజల్లేలా కార్యక్రమం నిర్వహించిన ఈటివి యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమానికి శ్రీ భ్రమర టౌన్ షిప్స్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించగా డబుల్ హార్స్ మినుపగుళ్లు, దుర్గా ఇంగువ సహ సమర్పకులుగా వ్యవహరించారు.
ఎవరిని ఎప్పుడు తీసుకెళ్తారో తెలియని భయం - ఇళ్లకు దూరంగా పురుషులు - ఆ గ్రామాల్లో నిర్మానుష్యం
అమరావతిలో నిర్మాణ పనులపై త్వరలో నిర్ణయం - పలు సంస్థల ఆసక్తి