Kannaiah Naidu Interview on Tungabhadra Dam Gate Repair Works: కర్ణాటక-ఆంధ్రప్రదేశ్-తెలంగాణ వరదాయిని తుంగభద్ర జలాశయ సంరక్షణకు ఇంజినీరింగ్ నిపుణులు రంగప్రవేశం చేశారు. కొట్టుకుపోయిన 19వ క్రస్ట్ గేటు స్థానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నీటివృథాను నిలువరించాలనేది వారి ముందున్న లక్ష్యం. ఈ ఖరీఫ్‌కు 80-90 టీఎంసీల నీరు అవసరం. పూర్తిస్థాయి జలాలు సమకూరాలంటే కొట్టుకుపోయిన గేటు స్థానంలో మరోటి అమర్చి జలాశయం భద్రతను కట్టుదిట్టం చేయక తప్పదు. ఈ పరిస్థితుల్లో గేట్ల రూపకల్పనలో ఎంతో అనుభవమున్న మన రాష్ట్రానికి చెందిన ఇంజినీరింగ్ నిపుణుడు కన్నయ్యనాయుడు రంగంలోకి దిగారు. మూడు రోజులుగా నిద్రాహారాలు మాని ఆనకట్టపై శ్రమిస్తున్న కన్నయ్యనాయుడు మంగళవారం ఈటీవీ భారత్‌తో పలు విషయాలు వెల్లడించారు.
- తుంగభద్ర గేటు కొట్టుకుపోవడానికి ప్రధాన కారణమేంటి? తక్షణ ప్రత్యామ్నాయ చర్యలేంటి?
కన్నయ్యనాయుడు: తుంగభద్ర జలాశయాన్ని 1954లో నిర్మించారు. మిగిలిన జలాశయాలతో పోలిస్తే దీని నిర్వహణ బాగున్నట్లే. మొత్తం 33 క్రస్ట్‌గేట్లలో 11 మినహా మిగిలిన వాటిని పరిశీలించాం. వాటి జీవితకాలం 45 ఏళ్లే. జలాశయం జీవితకాలం వందేళ్లు. ప్రస్తుతం ఈ ఆనకట్టకు 70 ఏళ్ల వయస్సు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో 70 ఏళ్లు నిండిన జలాశయం గేట్లు ఏవీ లేవు. కొత్త జలాశయాలకు అమర్చినవి 20 ఏళ్లకే పాడైపోతున్నాయి. 10వ తేదీ రాత్రి ప్రవాహ తీవ్రత వల్లే గేటు కొట్టుకుపోయింది.
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సమాచారం అందించగానే మేమంతా 12వ తేదీ ఉదయమే రంగంలోకి దిగాం. ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల సాహసించి పనుల్లో దిగడానికి ఎవరూ ముందుకు రాలేదు. నీరు తగ్గించి, ప్లాట్‌ఫాం సిద్ధం చేసి 12 అడుగుల ఎత్తున తాత్కాలికంగా స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయాలనేది ఆలోచన. ఈ రంగంలో పేరున్న జిందాల్ ఉక్కు సంస్థ సహకారం తీసుకున్నాం. పనుల్లో దిగే నిపుణుల కోసం ప్రత్యేక పరికరాలు బుధవారం అందుబాటులోకి వస్తాయి. కనీసం మూడు రోజుల్లో పనులు పూర్తి చేయాలనుకుంటున్నా మరోరోజు ఎక్కువ తీసుకోవచ్చు.
- తుంగభద్ర డ్యామ్ రాతి కట్టడం కావడంతో స్టాప్‌లాగ్ పెట్టలేరని కొందరు ఇంజినీర్లంటున్నారు కదా?
కన్నయ్యనాయుడు:జలాశయం గేట్ల ఏర్పాటులో నాకు 1972 నుంచి అనుభవం ఉంది. ఇప్పటివరకు నేర్చుకున్న విద్యను రంగరించి స్టాప్‌లాగ్ గేట్లు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాం. జలాశయ కట్టడంలో ఓ రాయి కదిలితే మొత్తం రాళ్లు పడిపోయే ప్రమాదం లేకపోలేదు. రాళ్లకు ముప్పు లేకుండా పనిచేయాలి. నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజి జలాశయాల్లో ఇలాంటి ఇబ్బందే ఉంది. ప్రకాశం బ్యారేజికి 2002లో పూర్తిస్థాయి మరమ్మతులు చేసి ఇచ్చాను. సింధనూరులో ఓ గేటు దెబ్బతిన్న సమయంలోనూ ప్రత్యామ్నాయం సిద్ధం చేశాం. నారాయణపురజలాశయంలోగేట్లకు 2007లో మరమ్మతులు చేసిచ్చాం. అవి బాగా పనిచేస్తున్నాయి. ఆ అనుభవం ఇక్కడ పనికొస్తోంది. మా నిర్ణయాలన్నీ కేంద్ర జలసంఘానికి వివరిస్తున్నాం. రానున్న రోజుల్లో మొత్తం గేట్లను మార్చాలని ప్రతిపాదించాం. ఆ పనిచేస్తే మరో 30 ఏళ్ల వరకు ఇబ్బంది ఉండదు.
- నీరంతా క్రస్ట్‌గేట్ల దిగువకు వెళ్లాక పూర్తిస్థాయి పనులు చేపడతారా? 60 టీఎంసీల నీరు వదిలేస్తే పంటలకు ముప్పు కదా?