ఏదో సాధించాలనే తపన - కిలిమంజారో అధిరోహించి రికార్డు IFS Officer Climbed Africa Highest Peak Mount Kilimanjaro: చిన్నప్పటి నుంచి ప్రకృతిపై ప్రేమ పెంచుకుంది ఈ యువతి. చదువులో చురుగ్గా ఉంటూనే ప్రకృతితో మమేకమైంది. కొండలు, కోనలు, సరస్సులు, అడవుల చెంత విహరించేది. సుందరమైన ఈ ప్రకృతి సౌందర్యాన్ని మరింత ఆస్వాదించాలనుకుంది. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి వావ్ అనిపించింది.
తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన ఈమె పేరు భరణి. తండ్రి సాథూర్ స్వామి ఆర్మీ అధికారిగా పని చేశారు. తల్లి పద్మ ప్రైవేట్ టీచర్. భరణి చిన్నప్పటి నుంచి ప్రకృతితో మమేకమవుతుండేది. ఆ క్రమంలోనే పర్వతాలు, నదులు, మైదాన ప్రాంతాలను సందర్శించడంపై ఇష్టం పెంచుకుంది.
ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులు- గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాలు
ప్రకృతి పట్ల ప్రేమ పెంచుకున్నప్పటికీ చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు భరణి. తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేసింది. ఆ క్రమంలోనే ఎన్సీసీలో చేరి సీనియర్ అండర్ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. అనంతరం ఎయిర్‌ఫోర్స్ లాజిస్టిక్స్ ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారడంతో సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2020లో సివిల్స్‌కి ఎంపికై, 6 నెలల బాబును వదిలి మరీ 2 సంవత్సరాలు శిక్షణకు వెళ్లానంటోంది భరణి.
ప్రస్తుతం కాకినాడ జిల్లాలో సబ్ డీఎఫ్‌ఓగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది ఈ యువ ఆఫీసర్. ఉద్యోగం చేస్తున్నప్పటికీ ప్రకృతిపై మక్కువతో పర్వతారోహణ దిశగా అడుగులేసింది. అలా గతేడాది హిమాలయన్ మౌంటనరీ ఇన్‌స్టిట్యూట్‌లో నెలరోజుల పాటు శిక్షణ తీసుకుని కిలిమంజారోను అధిరోహించింది. అంతేకాకుండా ప్రపంచంలోని 7 ఎత్తైన పర్వతాలను ఎక్కడమే తన లక్ష్యమని భరణి చెబుతోంది.
పర్వతాన్ని అధిరోహిస్తున్నప్పుడు శారీరక శక్తి తగ్గినప్పటికీ, మానసికంగా దృఢంగా ఉండాలని భరణి సూచిస్తోంది. ప్రకృతి మనకెంతో నేర్పిస్తుందనీ, దానిని ఆస్వాదిస్తే విజయ తీరాలకు మార్గం సుగమం అవుతుందని చెబుతోంది. భరణి పర్వతారోహణకు వెళ్తా అన్నప్పడు కాస్త భయం వేసిందని ఈమె తల్లిదండ్రులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ భరణి కిలిమంజారో అధిరోహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పెన్సిల్ కొనపై 'బాల రాముడు'- 93 లింకులతో గొలుసు- గిన్నిస్‌లోనూ చోటు
అవరోధాలన్నింటినీ అధిగమించి అత్యంత ఎత్తైన కిలిమంజారో అధిరోహించింది భరణి. ప్రకృతిపై ప్రేమ, పని పట్ల నిబద్ధత చూపుతూనే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్‌లో కిలిమంజారోను అధిరోహించిన తొలి అటవీ అధికారిణిగా భరణి రికార్డుకెక్కంది. తన విజయం మహిళలందరికీ అంకితమని చెబుతోంది.
"దిల్లీలో సివిల్స్‌కు సంబంధించిన ఇంటర్వ్యూకి వెళ్లాల్సివచ్చింది. అయితే వెళ్లగలనో లేదో అనే సందేహం కలిగింది. నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేను ఇంటర్వ్యూకి వెళ్లాను. 2020లో సివిల్స్‌కి ఎంపికై, 6 నెలల బాబును వదిలి మరీ 2సంవత్సరాలు శిక్షణకు వెళ్లి పూర్తి చేసుకున్నాను. ఉద్యోగం చేస్తున్నప్పటికీ ప్రకృతిపై మక్కువతో గతేడాది హిమాలయన్ మౌంటనరీ ఇన్‌స్టిట్యూట్‌లో నెలరోజుల పాటు శిక్షణ తీసుకుని కిలిమంజారోను అధిరోహించాను. ఇది మాత్రమే కాకుండా ప్రపంచంలోని 7 ఎత్తైన పర్వతాలను ఎక్కడమే నా లక్ష్యం." - భరణి, ఐఎఫ్‌ఎస్‌అటవీ శాఖ అధికారి, కాకినాడ