Justice PC Ghose Commission Visit Telangana on June 6th : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (పీసీ ఘోష్) వచ్చే వారం మరో దఫా రాష్ట్రానికి రానున్నారు. జూన్ ఆరో తేదీన ఆయన హైదరాబాద్ వచ్చి పది రోజుల పాటు రాష్ట్రంలోనే ఉంటారని సమాచారం.
జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే రెండు పర్యాయాలు తెలంగాణలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించడంతో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సమావేశమయ్యారు. మూడు బ్యారేజీలపై ప్రజల నుంచి ఫిర్యాదులను కూడా కమిషన్ కోరింది. ఆ గడువు నేటితో ముగియనుంది. ఇందుకోసం కార్యాలయం ఉన్న బీఆర్కే భవన్‌లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నాలుగు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఫిర్యాదు చేసే వారు ఆధారాలతో ప్రమాణపత్రం కూడా దాఖలు చేయాలని షరతు విధించారు. దీంతో ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు రాలేదని తెలుస్తోంది.
Kaleshwaram Barrages Issue Updates : జూన్ ఆరో తేదీన రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఏడో తేదీ నుంచి అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను జస్టిస్ పీసీ ఘోష్ సందర్శిస్తారని సమాచారం. అనంతరం హైదారాబాద్‌లో నిపుణుల కమిటీతో ఆయన సమావేశం కానున్నారు. ఐఐటీ, ఎన్ఐటీ సహా ప్రతిష్ఠాత్మక సంస్థల సాంకేతిక నిపుణులతో దీనిని ఏర్పాటు చేశారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఇచ్చిన వివరాలు, సమాచారం, జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక సహా ఇతర అంశాలపై జస్టిస్ ఘోష్ వారితో చర్చిస్తారు. ఆ తర్వాత విచారణ ప్రక్రియను కొనసాగించనున్నారు.