Kaleshwaram Project Judicial Inquiry Updates :ఆనకట్టల నిర్మాణాల విషయంలో ఎక్కడో లెక్కలు తప్పినట్లు కనిపిస్తోందని కాళేశ్వరంపై న్యాయ విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (పీసీ ఘోష్) వ్యాఖ్యానించారు. లోపం ఎక్కడుంది? ఏం జరిగిందన్న విషయం తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నామని తెలిపారు. ఇందులో ఎవరి ప్రమేయమైనా ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ బీఆర్కే భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో మీడియాతో జస్టిస్ పీసీ ఘోష్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
Kaleshwaram Barrages Issue Updates :మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల బాధ్యతలను పర్యవేక్షించిన ఇంజినీర్ల విచారణ కొనసాగుతోందని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఇప్పటికే మూడింటి సమాచారాన్ని తెలుసుకున్నామని చెప్పారు. విచారణకు హాజరవుతున్న వారంతా ఈ నెల 25లోపు అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించామని పేర్కొన్నారు. బ్యారేజీల్లో చోటుచేసుకున్న సంఘటనలు, తెలిసిన అంశాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఇప్పటికే చెప్పామని అన్నారు. ఎవరైనా తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమ, మంగళవారాల్లో ఇంజినీర్ల విచారణ జరిగిందని, ఇక నిర్మాణ సంస్థల ప్రతినిధులను పిలువనున్నట్లు జస్టిస్ పీసీ ఘోష్ వెల్లడించారు.
బ్యారేజీలు సరైన రీతిలో ఉంటే లాభమే : నిర్మించిన ఆనకట్టలు సరైన రీతిలో ఉంటే ప్రజలకు లాభమే తప్ప నష్టం ఉండదని జస్టిస్ పీసీ ఘోష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏవో తప్పుడు లెక్కలతోనే ఇలా జరిగినట్లు అనిపిస్తోందని చెప్పారు. విచారణలో భాగంగా ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో అధికారుల ప్రమేయం ఉన్నట్లు గుర్తిస్తే వారికి కూడా నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇతరుల వద్ద ఏదైనా సమాచారముంటే అఫిడవిట్ రూపంలో సమర్పించవచ్చని జస్టిస్ పీసీ ఘోష్ సూచించారు.
విచారణకు 18 మంది ఇంజినీర్లు : మంగళవారం నాడు విచారణకు 18 మంది ఇంజినీర్లు హాజరయ్యారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారితోపాటు గతంలో ఆయా విభాగాల్లో పనిచేసిన వారిని కూడా కమిషన్ విచారణకు పిలిచింది. ఈఎన్సీ (ఓఅండ్‌ఎం) నాగేంద్రరావు, ఎస్‌డీఎస్‌ఓ విభాగం నుంచి సీఈ ప్రమీల, ఎస్‌ఈ మురళీకృష్ణ, క్వాలిటీ కంట్రోల్ విభాగానికి సంబంధించి గతంలో సీఈగా పనిచేసిన వెంకటేశ్వర్లు, ఎస్‌ఈగా పనిచేసి ప్రస్తుతం సంగారెడ్డి సర్కిల్ సీఈగా ఉన్న అజయ్‌కుమార్, ప్రస్తుత సీఈ వెంకటకృష్ణ, మేడిగడ్డ ఆనకట్ట సీఈ సుధాకర్‌రెడ్డి, గతంలో ఎస్‌ఈగా పనిచేసి ఇప్పుడు మహబూబ్‌నగర్ సీఈగా ఉన్న రమణారెడ్డి హాజరయ్యారు.