Janasena Leader Nagababu Serious Comments On YCP Party :జనసేన పార్టీ నేత కొణిదల నాగబాబు వైఎస్సార్సీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ జరగటానికి ఒకరోజు సమయం ఉండటంతో వైఎస్సార్సీపీ నేతలు మరొక నీచత్వానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఓటుకు నోటు ఇచ్చేందుకు ప్లాన్ వేశారని, వైఎస్సార్సీపీ రౌడీలు, గూండాలు ప్రతి ఇంటికీ వెళ్లి డబ్బులు అందజేయడంతోపాటు డబ్బులు తీసుకున్న ప్రజల వేళ్లపై ఓటు వేసినట్లుగా సీరా మార్కు వేయాలనే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. ఫలితంగా 13వ తేదీన వాళ్లు ఓటు వేసేందుకు అనర్హులుగా మారుస్తున్నారని నాగబాబు మండిపడ్డారు.
ఓటర్లు పోలింగ్ బూత్‌కు వెళ్లినా అనర్హుడిగా ప్రకటించే ప్రమాదం :ప్రతి ఓటరు డబ్బులు తీసుకుని ఇంట్లోనే ఉండేలా వైఎస్సార్సీపీ నేతలు భయపెడుతున్నారని అన్నారు. పిఠాపురం వంటి నియోజకవర్గంలో భారీగా డబ్బులు ఇచ్చి వేళ్ల మీద సిరా చుక్కలు వేసేలా పన్నాగం పన్నారన్నారు. ఓటర్లు పోలింగ్ బూత్‌కు వెళ్లినా సిరా గుర్తు చూసి అనర్హుడిగా ప్రకటించే ప్రమాదం ఉందని తెలిపారు.
ఈ అంశాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును కాలరాసే విధంగా అమాయక ప్రజలను వైఎస్సార్సీపీ నేతలు మళ్లీ మోసం చేస్తున్నారన్నారని విమర్శించారు. ప్రజలు డబ్బులు తీసుకుంటారా? లేదా? అనేది వారి వ్యక్తిగతమని, కానీ ఎవరూ కూడా సిరా చుక్కను వేస్తామంటే తిరస్కరించాలని కోరారు. మీ మనస్సు చెప్పిన విధంగా మంచి పాలన అందించే వారికే ఓటు వేయాలని సూచించారు. జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు సర్వనాశనం అవుతాయని నాగబాబు హెచ్చరించారు.