Jana Sena Legislative Party Meeting:వైఎస్సార్సీపీ సభ్యులు అసెంబ్లీలో అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా సరే జనసేన సభ్యులు సంయమనం కోల్పోవద్దని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. హుందాగా వ్యవహరించాలని పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో దిశానిర్దేశం చేశారు. గతంలో చట్టసభల్లో వాళ్ల భాష, విధానం ప్రజలంతా గమనించారని బురదలో కూరుకుపోయిన వైఎస్సార్సీపీ సభ్యులు దాన్ని మనకూ అంటించాలని చూస్తారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మాట్లాడే భాష విషయంలో జాగ్రత్త:ఇవాళ్టి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జనసేన కేంద్ర కార్యాలయంలో ఆదివారం సాయంత్రం పవన్ కల్యాణ్ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. చట్టసభల్లో మాట్లాడే భాష, వాడే పదాల విషయంలో సభ్యులు జాగ్రత్తగా ఉండాలని వైఎస్సార్సీపీ ప్రతినిధుల దిగజారుడు వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దని దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో సామాన్యుడి గొంతును సభలో బలంగా వినిపించాలని పవన్ కల్యాణ్ చెప్పారు.
ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చర్చల్లో పాల్గొనాలి:అభ్యంతరకర పదజాలం వాడొద్దని తనతో సహా ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన పదాలే వినియోగించాలని చెప్పారు. చట్టసభల్లో మాట్లాడేది ప్రజలంతా గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. భాష విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనే దానిపై నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, హరిప్రసాద్ గైడ్ చేయాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, ఆకాంక్షలు, ఆశలను చట్టసభల్లో వినిపించేలా ప్రతి జనసేన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చర్చల్లో పాల్గొనాలని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు.