Jagan Role Behind Saraswati Power Plant in Palnadu District :జగన్‌కు చెందిన సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు పల్నాడు జిల్లాలో వందల ఎకరాల్లో సున్నపురాయి నిల్వలను వైఎస్ హయాంలో కట్టబెట్టడంలో నిబంధనలకు పాతరేశారు. జగన్ సీఎం అయ్యాక మరింత ముందుకు వెళ్లి సొంత కంపెనీకి మరిన్ని 'మేళ్లు' చేసుకున్నారు. పర్యావరణ శాఖను తప్పుదోవ పట్టించి ఎప్పటికప్పుడు అనుమతులు పునరుద్ధరించుకుంటున్న విషయం అధికారుల పరిశీలనలో బయటపడింది. జగన్ కంపెనీ ఆధీనంలోని భూముల్లో ప్రభుత్వ భూములూ ఉన్నట్టు అధికారుల దృష్టికివచ్చింది. తండ్రి, కుమారుడు ముఖ్యమంత్రులుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి సరస్వతీ పవర్‌కు అడ్డగోలుగా చేసుకున్న 'మేళ్ల'పై లోతైన విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
తండ్రీకుమారుల అధికార దుర్వినియోగం : వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు చెందిన సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు పల్నాడు జిల్లాలోని మాచవరం, దాచేపల్లి మండలాల్లో కొన్ని వందల ఎకరాల పరిధిలో విలువైన సున్నపురాయి నిల్వలను ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా ధారాదత్తం చేయడంలో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు వెల్లడైంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిబంధనలు తుంగలో తొక్కుతూ సొంత కంపెనీకి మరిన్ని 'మేళ్లు' చేసుకున్నారని బయటపడింది. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ తనదేనంటూ తాజాగా జగన్ తన తల్లి విజయలక్ష్మిపై ఎన్సీఎల్టీలో (NCLT) కేసు దాఖలు చేయడంతో ఆ కంపెనీకి సున్నపురాతి నిక్షేపాల కేటాయింపు మొదలు ఇప్పటివరకు జరిగిన ఉల్లంఘనలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు - సరస్వతి పవర్ భూముల్లో అధికారుల సర్వే
సొంత కంపెనీకి ధారదత్తం :విద్యుదుత్పుత్తి కంపెనీగా ఉన్న సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ వ్యాపార తరహాపై బైలాస్‌లో మార్పులు చేయకుండానే అప్పటి జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా గనులు లీజుకు ఇచ్చేసింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరుమీద సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని నిర్ణయించిన జగన్ దాని బైలాస్‌లో మార్పులు చేయాలని అనుకున్నారు. 2008 జులై 15న జగన్ అధ్యక్షతన కంపెనీ అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కంపెనీ సిమెంట్ వ్యాపారంలో ప్రవేశించేలా బైలాస్‌లో మార్పులు చేస్తూ జగన్ భార్య భారతి తీర్మానం ప్రవేశపెట్టారు. జగన్ తల్లి విజయలక్ష్మి బలపరిచారు. కానీ దానికి నెల ముందే నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2008 జూన్ 12న గనులశాఖ డైరెక్టర్ జారీచేసిన మెమో ఆధారంగా సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు మైనింగ్ లీజు కేటాయించింది. 2009 మే18న జీవో 107 జారీ చేసింది. అంటే కంపెనీ బైలాస్ మార్చకముందే లీజుకు ఆమోదం తెలుపుతూ మైనింగ్ శాఖ మెమో జారీ చేసింది. ఇది చట్టవిరుద్ధం, అధికార దుర్వినియోగమని అధికారులు చెబుతున్నారు.
ఆ కేసుకు ఆరు సంవత్సరాలు - ఇప్పటి వరకు విచారణకు హాజరవ్వని జగన్
పర్యావరణశాఖకు తప్పుడు సమాచారం :సరస్వతీ పవర్‌కు తొలుత 2012 మార్చి 29న కొన్ని నిబంధనలకు లోబడి పర్యావరణ అనుమతులు జారీ అయ్యాయి. దాని ప్రకారం ఏడాదికి 0.0368 టీఎంసీల నీళ్లు సరస్వతీ పవర్‌కు కేటాయించాలి. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఆ నిబంధనను తుంగలో తొక్కుతూ సొంత కంపెనీకి 0.068 టీఎంసీలు కేటాయించేసుకున్నారు. ఇది పర్యావరణశాఖ అనుమతి ఇచ్చిన దాని కంటే రెట్టింపు. 2019 డిసెంబరు 3న జీవో81 జారీచేశారు. తర్వాత 2020 మే 15న (15-05-2020) జీవో16 ద్వారా ఐదేళ్ల నీటి కేటాయింపును జీవిత కాలానికి మార్చేసుకున్నారు.