Jagan Govt Ready to Take Huge Loans Before Elections:ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెలువడే వరకూ అధికారంలోకి ఎవరు వస్తారో తెలియదు. అయినా ఏప్రిల్, మే నెల్లోనే 20వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవాలన్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక శాఖ అప్పులకు అనుమతులు ఇచ్చేందుకు సమయం పడుతుంది. దాదాపు ఏప్రిల్ మూడో వారానికి రాష్ట్ర నికర రుణ పరిమితి తేల్చి, వచ్చే ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎంత రుణం ఇవ్వనున్నదీ తేల్చిచెబుతుంది.
ఆ మేరకు తొలి 9 నెలల్లో ఎంత తీసుకోవచ్చో ఆ మేరకు అనుమతి ఇస్తుంది. ఐతే నెలకు ఇంతే తీసుకోవాలనే పరిమితి విధించదు. గతేడాది రుణాల అనుమతులు రావడానికి ఏప్రిల్లో చాలా ఆలస్యమయింది. జీతాల చెల్లింపులకూ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈసారి ముందే స్పందించారు. కానీ, వచ్చే ప్రభుత్వం పొందాల్సిన అప్పుల్లో సింహభాగం ముందే తీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఆందోళన కలిగిస్తున్నాయి. ఏప్రిల్ 2న 4వేల కోట్ల రూపాయల రుణం పొందేందుకు కేంద్రం నుంచి ఆర్థికశాఖ అధికారులు ఇప్పటికే అనుమతులు తీసుకున్నారు.
అనుమతులు ఉన్నాయా: రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో 3.5శాతం మొత్తానికి కేంద్రం ప్రతి ఏటా రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తుంది. విద్యుత్తు సంస్కరణలు, ఇతర రూపేణా మరో 0.5శాతం వరకు అనుమతులు ఇస్తోంది. ఈ నికర రుణపరిమితి లెక్క తేల్చే క్రమంలో ఇతరత్రా రూపాల్లో తీసుకునే మొత్తాలు మినహాయిస్తుంది. గతంలో అదనంగా పొందిన అప్పుల మొత్తాలను ఏడాదికి ఇంత చొప్పున మినహాయిస్తోంది. కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలు ఇందులో కలపాలి.
అన్ని రుణాలు కలిపే నికర రుణ పరిమితి అవుతుందని రిజర్వుబ్యాంకు, ఆర్థిక సంఘం గతంలోనే తేల్చి చెప్పాయి. కార్పొరేషన్ల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటున్నా అవి ఇందులో కలిపి లెక్కిస్తున్న దాఖలాలు లేవు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎంత లేదన్నా సుమారు 50వేల కోట్ల రూపాయల వరకు కొత్త అప్పులకు అనుమతులు రావచ్చనే అంచనాలు ఉన్నాయి. కేంద్రఆర్థికశాఖ ఎంతవరకు అనుమతి ఇచ్చిందన్నది ఇంకా తేలలేదు.