Jabalpur Road Accident : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరికొందరు యాత్రికులు మినీ బస్సులో చిక్కుకుపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
స్థానికుల సహాయంతో బస్సులో ఇరుక్కున్నవారిని బయటకు తీశారు. బాధితులను సిహోరాలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్‌లోని నాచారం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈరోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు హైవే పైకి రాంగ్ రూట్‌లో రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.