IT Minister Nara Lokesh in US India Strategic Partnership Forum Summit :ఏపీని తొలి ట్రిలియన్ డాలర్ల రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పెట్టుబడిదారులకు వేగంగా చేయూతనందిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో నూతన రాజధాని, పోర్టులు, బిగ్‌డేటా సెంటర్స్, పెట్రో, కెమికల్, ఆక్వా, బయోఫ్యూయల్స్, ఫార్మా, మెడికల్ పరికరాలు, ఐటీ, రంగాల్లో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయని వెల్లడించారు. 'స్టార్టప్ ఆంధ్ర' నినాదం మాత్రమే కాదన్న లోకేశ్ పాలనా విధానాన్ని మార్చే ఆయుధంగా అభివర్ణించారు.
దిల్లీలో జరిగిన U.S- ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం లీడర్ షిప్ సమ్మిట్‌లో ఐటీ శాఖ మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఏపీ పెట్టుబడుల స్వర్గధామమని వివరించిన లోకేశ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సత్వరం అందించనున్న సహాయ సహకారాలను వివరించి చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన వారందరినీ కలిపి ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి వారం వారం అప్‌డేట్స్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వపరంగా వేగంగా స్పందిస్తున్నామని ఇందుకోసం ఎకనమిక్ డెవలప్‌మెంట్‌బోర్డును పునరుద్ధరించామని గుర్తు చేశారు.
వినూత్న ఆలోచనలు, ప్రయోగాలకు కూటమి ప్రభుత్వం ముందుంటుందన్న లోకేశ్ ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో నైపుణ్య గణన మొదలుపెట్టామన్నారు. ఇంటింటికి వెళ్లి సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడమేగాక వారి నైపుణ్యాలను అంచనా వేసి మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలన్న దానిపై దృష్టిపెట్టినట్లు వివరించారు. ఎన్నికల హామీలో భాగంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని లోకేశ్ వెల్లడించారు. విశాఖను డేటా, ఏఐ, ఎంఎల్ కేంద్రంగా మార్చనున్నట్లు లోకేశ్ వివరించారు.