Nara Lokesh Visit Delhi :దేశంలోనే అత్యంత సులభతరమైన ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అన్ని రకాల పరిశ్రమలకు అనువైన ఎకో సిస్టమ్‌ని ఏర్పాటు చేసుకుని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదంతో ముందుకెళ్తున్నట్లు వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా లోకేశ్ వరుసగా రెండో రోజు దిల్లీలో కేంద్ర పెద్దలు, వివిధ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు.
ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మహీంద్ర అధ్యక్షతన భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చడానికి చేపడుతున్న చర్యలు, ఏపీ అనుకూలతలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. తరచూ వారితో సమావేశమై విధానపరమైన సమస్యలు, సవాళ్లను అధిగమించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. వేగవంతమైన అనుమతులకు ఈడీబీని పునరద్ధరించామని, సరైన ప్రతిపాదనలతో వచ్చేవారికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని లోకేశ్ స్పష్టం చేశారు.
ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఇతర రాష్ట్రాలతోనే కాకుండా, ఇతర దేశాలతోనూ పోటీపడుతున్నామని లోకేశ్ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు సాధించడంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. అందుకే ఐటీ, ఎలక్ట్రానిక్స్ పారిశ్రామిక వేత్తల కోసం టైలర్ మేడ్ పాలసీలను రూపొందిస్తామని పేర్కొన్నారు. తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చేందుకు సహకరించాలని పారిశ్రామికవేత్తలను లోకేశ్ కోరారు.
సహకారం అందించాలి :తిరుపతిలో ఇప్పటికే డిక్సన్, డైకిన్, టీసీఎల్ కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేశాయని లోకేశ్ వివరించారు. అనంతపురంలో కియా మోటార్స్ ఇప్పటికే పనిచేస్తోందని చెప్పారు. అనంతపురంతో పాటు కర్నూలు జిల్లాలోనూ అటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ, ఈవీ కేంద్రాలు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధికి సహకారం అందించాలని పారిశ్రామికవేత్తలను లోకేశ్ కోరారు.