Be Careful When Shopping During Festivals :దసరా, దీపావళి.. ఈ వేడుకలంటేనే ఆనందం. ఏదో ఒక కొత్త వస్తువును కొనాలని అందరూ ఆలోచన చేస్తుంటారు. ఈ సమయంలో సంస్థలు ఇచ్చే ఆఫర్లు, రాయితీలు మనల్ని ఆకర్షిస్తుంటాయి. కొనుగోళ్ల విషయంలో కాస్త క్రమశిక్షణ గాడితప్పినా ఆర్థిక సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది. దీనిని నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఒకప్పుడు పండగల సందర్భంలోనే ఎక్కువగా కొనుగోళ్లు ఉండేవి. ఇ-కామర్స్ కంపెనీల రాకతో ఇది మారిపోయింది. ఇక్కడ ఏడాదంతా ఏదో ఒక డిస్కౌంట్ లభిస్తూనే ఉంటుంది. కొత్త కొత్త వస్తువులు సరికొత్త ఆఫర్లలో కనిపిస్తూనే ఉంటాయి. దీంతో కొనుగోళ్ల తీరు పూర్తిగా మారిపోయింది. అయినప్పటికీ పండగలప్పుడు అధిక మొత్తంలో కొనడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి టైంలో కాస్త అప్రమత్తంగా ఉంటే, మిగతా ఏడాదంతా ఆనందంగా ఉండొచ్చు.
బడ్జెట్‌ను సిద్ధంగా..
కొనుగోళ్ల కోసం స్పెషల్గా ఒక బడ్జెట్‌ను కేటాయించుకోవాలి. ఇందులోనే జర్నీలకు సంబంధించిన ఖర్చులూ ఉండాలి. ప్రతి అంశానికీ ఎంత మేరకు ఖర్చు చేయాలన్నది ముందుగానే నిర్ణయించుకోవాలి. చివరి నిమిషంలో కొంత మేర వ్యత్యాసం ఉండొచ్చు. కానీ, ఇది 5 నుంచి 10 శాతానికి మించి పెరగకూడదు. మరో ప్రధాన విషయం ఏమిటంటే.. పండగల కోసం ముందునుంచే కొంత మొత్తాన్ని పొదుపు చేసి పెట్టుకోవడం వల్ల చివరి నిమిషంలో ఆర్థిక ఒత్తిడి లేకుండా చూసుకోవచ్చు. వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచే సంసిద్ధం కావడం అన్నమాట.
ఆన్‌లైన్ చెల్లింపులతో
కొనుగోళ్లు ఎక్కువగా చేసేందుకు ఆన్‌లైన్‌లో చెల్లించడమూ ఒక కారణమని రిపోర్టులు చెబుతున్నాయి. యూపీఐ పేమెంట్స్, క్రెడిట్ కార్డులకూ పరిమితులు విధించుకోండి. ఎంత వరకూ ఖర్చు చేయాలో అంతే మొత్తం సంబంధిత అకౌంట్లో ఉండేలా చూసుకోండి. టెంపరరీగా క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయండి. యూపీఐ అనుసంధానించిన బ్యాంకు అకౌంట్లను తొలగించండి. దీనివల్ల ఖర్చులను కొంతమేర అరికట్టేందుకు వీలవుతుంది.