INVESTMENTS FOR AP: రాష్ట్రంలో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులతో మరో 9 ప్రాజెక్టుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. వీటి ద్వారా 2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్దఎత్తున వస్తున్న సంస్థలకు భూకేటాయింపులతో సహా మౌలిక వసతులను శరవేగంగా కల్పించాలని సీఎం ఆదేశించారు. ఒప్పందం ప్రకారం నిర్ధిష్ట సమయంలోనే ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం స్పష్టం చేశారు.
భారత్ పెట్రోలియం భారీ పెట్టుబడి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన స్టేట్ ఇన్వెస్టర్స్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశంలో రాష్ట్రంలో వివిధ సంస్థలు ఏర్పాటు చేసే 9 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 2,400 మందికి ఉపాధి కలుగనుంది.
ఏపీలోనూ "హైటెక్ సిటీ" నిర్మాణం - 2029 నాటికి 5లక్షల వర్క్స్టేషన్లు : చంద్రబాబు
మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్ధ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మిస్తారు. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి రూ.88,747 కోట్ల ఆదాయం రానుందని అధికారులు తెలిపారు. 2029లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.
విశాఖలో పెట్టుబడి పెట్టనున్న టీసీఎస్: విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రూ.80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో వచ్చే ఆరేళ్లలో పూర్తయ్యేలా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఈ సంస్థ రూ.1,046 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 2,381 మందికి ఉపాధి కలుగుతుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో రూ.1,174 కోట్లతో 1,500 మందికి ఉపాధి కలిగేలా బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీఎఫ్ లేదా పర్టికల్ బోర్డు ప్లాంట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పనుంది.