ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"పెళ్లి మీది.. పండగ వాళ్లది" - బంధువులొస్తున్నారు జాగ్రత్త! - THIEVES IN WEDDING CELEBRATIONS

వివాహాది వేడుకల్లో పెరుగుతున్న చోరీలు - బంధువుల వేషధారణలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా

thieves_in_wedding_celebrations
thieves_in_wedding_celebrations (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2024, 1:20 PM IST

Updated : Dec 16, 2024, 5:15 PM IST

Thieves in wedding celebrations :'సందట్లో సడేమియా..' ఇదే కాబోలు. భారీ విజయం సాధించిన పెళ్లి సందడి సినిమాలో కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే. సినిమా ఆద్యంతం కామెడీ సీన్లతో పొట్టచెక్కలు కావాల్సిందే. మరీ ముఖ్యంగా 'కాఫీలు తాగారా.. టిఫీనీలు చేశారా!' అంటూ పెళ్లింట ఆహ్వానం పలుకుతూ ఆత్మీయత ఒలకబోసే ఇద్దరు వ్యక్తులు గుర్తుండే ఉంటారు. అందరినీ పలుకరిస్తూనే చేతివాటం ప్రదర్శిస్తుంటారు. చేతికందిన సామగ్రిని చోరీ చేస్తూ చివర్లో దొంగలుగా బయటపడతారు. సరిగ్గా వెండితెరపై నవ్వించిన పాత్రల మాదిరే ప్రస్తుతం వివాహాది శుభకార్యాల్లోనూ పలువురు జీవిస్తున్నారు. ఫంక్షన్లు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుని సందట్లో బంధుమిత్రుల్లా మారి అదను చూసి అందినంత కాజేస్తున్నారు. సరైన సమయం చూసుకొని ఉడాయిస్తూ షాక్ ఇస్తున్నారు.

హైదరాబాద్​లోని షేక్‌పేట్‌లో వివాహ వేడుకలో అందరూ హడావుడిగా ఉన్న సమయం చూసి ఇద్దరు మహిళలు బంధువుల మాదిరి ప్రవేశించారు. చక్కగా ముస్తాబై పెళ్లికూతురు గదిలోకి వెళ్లి కొద్దిసేపయ్యాక తిరిగి వెళ్లిపోయారు. ఆలస్యంగా తేరుకున్న బంధువులు ఆ గదిలో హారం మాయమైనట్టు గుర్తించి . సీసీటీవీ కెమెరా ఫుటేజీ వెతికారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. గుర్తు తెలియని ఇద్దరు మహిళలు హడావుడిగా బయటకు వెళ్తూ కనిపించడంతో చోరీ జరిగినట్లు తేల్చారు. ఇదిలా ఉంటే ఆసిఫ్‌నగర్‌లో వివాహం జరిగే ఇంట బంగారం మాయమైంది. కుటుంబసభ్యులు పెళ్లిపనుల్లో బిజీగా ఉండడంతో దగ్గరి బంధువులే చోరికి పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు చివరకి అరెస్ట్‌ చేశారు.

పెళ్లి ఫ్లెక్సీలు వేయిస్తున్నారా? - ఊహించని అతిథులతో ఇల్లు గుల్ల!

ఆత్మీయులుగా నటిస్తూ..

హైదరాబాద్​లో నెల రోజులుగా వివాహాది శుభకార్యాలు జరుగుతున్నాయి. ఇక వివాహాలు జరిగే ఇంట్లో సందడి అంతా ఇంతా కాదు. పెళ్లికి వారం రోజుల ముందుగానే హడావుడి మొదలవుతుంది. ఇక పెళ్లి రోజు ఎవరెవరు వస్తున్నారో కూడా గుర్తించలేని పరిస్థితి. వచ్చిన వారిలో బంధుమిత్రులు ఎవరనేది గుర్తించటం అసాధ్యమే. 'ఎవరు మీరు?' అని ప్రశ్నించలేం. ఒక వేళ నిజంగా బంధువులే అయితే నొచ్చుకుంటారు. పెళ్లికి పిలిచి అవమానిస్తారా అంటూ వెళ్లిపోతే ఇక అంతే సంగతి. అందుకే వచ్చింది ఎవరని పెద్దగా పెట్టించుకోరు. ఇదే అదునుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఓ వైపు వధూవరుల కుటుంబీకులు పెళ్లి పనుల్లో బిజీగా ఉండడాన్ని అవకాశంగా తీసుకుని రెచ్చిపోతున్నారు. ఖరీదైన దుస్తులు ధరించి వివాహ మండపం వద్దకు చేరుతున్నారు. నిజమైన అతిథులుగా నటిస్తూ పెళ్లిపీటలపై వధూవరులను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత పెళ్లి విందు కూడా ఆరగించి అప్పటికే ప్రణాళిక రూపొందిస్తారు. అనుకున్న ప్రకారం విలువైన వస్తువులను మాయం చేస్తుంటారని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.

తాజాగా ఓ వ్యాపారి కుమారుడి వివాహంలోనూ భారీ చోరీ జరిగింది. వరుడి స్నేహితుడిని అంటూ ఓ యువకుడు సెల్‌ఫోన్లు కొట్టేశాడు. ఆదిభట్ల పరిధిలో ఫంక్షన్‌హాలులో జరిగిన పెళ్లిలో బంధువుల వేషంలో వచ్చిన దొంగల ముఠా భారీగా నగదు, బంగారు నగలున్న బ్యాగు మాయం చేశారు.

బంగారు నగలు.. సెల్‌ఫోన్లు

అంతరాష్ట్ర దొంగల ముఠా ఫంక్షన్‌హాళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వధువు, వరుల గదుల్లోకి వెళ్లి విలువైన ఆభరణాలు కాజేసి వాటిని ఇతరులకు అందించి మాయం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి దొంగతనాలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో జరిగినట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు వివరించారు. 20కు పైగా చోరీలకు పాల్పడిన ఓ అంతర్రాష్ట్ర ముఠా నాయకుడిని అరెస్టుతో చోరీల వైనం వెలుగులోకి వచ్చింది.

మేనత్త కుటుంబంపై పగ - యూట్యూబ్​లో శోధించి మరీ చోరీ

కారెత్తుకెళ్లాడు - చల్లగాలికి నిద్రలోకి - సీన్​ కట్​ చేస్తే

Last Updated : Dec 16, 2024, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details