Inquiry into Award of Sand Contracts and Mining Leases in AP :ఏ అధికారైనా తాను పని చేసే సంస్థకు మేలు చేయాలని చూస్తారు. కానీ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చి గనుల శాఖ, ఏపీఎండీసీల (APMDC) బాస్‌గా వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డి మాత్రం వైఎస్సార్సీపీ పెద్దల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేశారు. చిత్తూరు జిల్లాలో గ్రానైట్ లీజుల విషయంలో ఏపీఎండీసీకి నష్టం జరుగుతుందని తెలిసినా సరే, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులకు మేలు చేసేందుకు వెంకటరెడ్డి నిర్ణయాలు తీసుకున్నట్లు తాజాగా బయటపడింది.
అడ్డగోలుగా లీజు మంజూరు :ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం ఈశ్వరాపురంలో పాత సర్వే నంబరు 6లో ఉన్న కొండలో కలర్ గ్రానైట్ నిల్వలున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన వారితోపాటు, తమిళనాడుకి చెందినవారు 28 మంది అక్కడ లీజుల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ కూడా ఇక్కడ 43.450 హెక్టార్లను రిజర్వ్ చేయాలంటూ 2017, మే 16న ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. గతంలో ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే లీజు కేటాయింపు అనే పద్ధతి ఉండేది. ఇతర దరఖాస్తులను కాదని, ఏపీఎండీసీకి (APMDC) లీజులు కేటాయించేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కూడా ఉండేది. 2019లో జగన్ సర్కార్ అధికారంలోకి రావడంతో సీను మొత్తం మారిపోయింది.
అడ్డగోలుగా పెద్దిరెడ్డి బంధువులకు :పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుల శాఖ మంత్రి (Minister of Mines) అయ్యాక ఈశ్వరాపురంలోని కలర్ గ్రానైట్‌పై ఆయన కన్నుపడింది. దాని కోసం ఆయన తన బంధువుల పేరిట 2019 నవంబరులో దరఖాస్తు చేయించారు. తర్వాత అక్కడ లీజుల కోసం ఏపీఎండీసీ (APMDC) దాఖలు చేసిన దరఖాస్తును ఉపసంహరించేలా ఒత్తిడి చేశారు. దీంతో 2020లో ఏపీఎండీసీ సంస్థ ఇన్‌ఛార్జ్ ఎండీగా బాధ్యతలు చేపట్టిన వెంకటరెడ్డి ఆ దిశగా అడుగులు వేశారు. ఏపీలో ఎండీసీ ఎక్కడెక్కడ లీజుల కోసం దరఖాస్తు చేసిందో జాబితా తయారు చేయించారు. ఇతరులు ముందే దరఖాస్తు చేసిన లీజుల నుంచి ఏపీఎండీసీ వైదొలగాలని అంటూ హుకుం జారీ చేశారు.
దరఖాస్తుల ఉపసంహరణకు ఆదేశాలు : ఈశ్వరాపురంలో అప్పటికే కొన్నేళ్లుగా ఇతరుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అక్కడ ఏపీఎండీసీ లీజుల కోసం వేసిన దరఖాస్తులను ఉపసంహరించాలని ఆదేశించారు. దీంతో ఏపీఎండీసీ 2020 నవంబరు 4న (4-11-2024) దరఖాస్తును ఉపసంహరించుకుంది. అనంతరం అక్కడ గతంలో దరఖాస్తు చేసుకున్న 28 మందిలో ఎవరికీ లీజులు కేటాయించకుండా తెలివితేటలు ప్రదర్శించారు. పాత దరఖాస్తుదారులు అందరినీ కాదని పెద్దిరెడ్డి బంధువులకు ఏకంగా 5 గ్రానైట్లను లీజులు కేటాయించారు.