ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువత భవితపై గుదిబండ - జగన్ దెబ్బకు పరిశ్రమలు అతలాకుతలం - Industries Closed During Jagan Govt - INDUSTRIES CLOSED DURING JAGAN GOVT

Industries Closed During Jagan Government: కరవు సీమ అనంతపురం జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా మారుస్తామని అరచేతిలో స్వర్గం చూపిన జగన్‌ ఉన్నవాటిని మూతవేయించారు. యువతకు ఉపాధి కల్పిస్తామని ఊరించి ఉసూరుమనిపించారు. ఒక్క తాడిపత్రిలోనే 200కుపైగా గ్రానైట్‌ పరిశ్రమలను మూతపడేలా చేశారు. కమీషన్ల కోసం జాకీ సంస్థను తరిమేశారు. లేపాక్షి భూములను కాజేసేందుకు కుట్రలు పన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్న జగన్‌ వీటిపై సమాధానం చెప్పగలరా.

industries_in_ap
industries_in_ap

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 1, 2024, 10:20 AM IST

Updated : Apr 1, 2024, 10:27 AM IST

యువత భవితపై గుదిబండ - జగన్ దెబ్బకు పరిశ్రమలు అతలాకుతలం

Industries Closed During Jagan Government:కరవు సీమ అనంతను పారిశ్రామిక కేంద్రంగా మారుస్తామన్నారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా భారీగా ఉపాధి కల్పిస్తామంటూ 2019 ఎన్నికల ప్రచారంలో హామీల గుప్పించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన కియా పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి లభించేలా ప్రాధాన్యం ఇప్పిస్తామని కబుర్లు చెప్పారు. వేల మందికి ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్‌ పరిశ్రమను పునరుద్ధరిస్తామంటూ గొప్పలు పోయారు. గద్దెనెక్కాక అసలు రంగు బయటపెట్టారు. ఐదేళ్లలో జిల్లాకు ఒక్కటంటే ఒక్క సంస్థనూ తీసుకురాలేదు. పరిశ్రమల కోసం గతంలో ఏర్పాటు చేసిన లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కోసం గతంలో రైతులిచ్చిన 8 వేల ఎకరాలను అయినవారికి దోచిపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి మోసం చేయడానికి ఎన్నికల ప్రచారం కోసం శ్రీసత్యసాయి జిల్లాకు వచ్చేందుకు సిద్ధమైపోయారు.

మీ సమస్య గురించి తర్వాత ఆలోచిద్దాం- ముందు వైఎస్సార్సీపీలో చేరి గెలిపించండి

తాడిపత్రి ప్రాంతంలో 300 వరకు గ్రానైట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉండేవి. 10వేల మంది కూలీలు వీటిపై ఆధారపడి జీవించేవారు. వైసీపీ విధానాలు ఈ యూనిట్లకు శరఘాతంగా మారాయి. రాయల్టీ పెంపు, విద్యుత్తు ఛార్జీల బాదుడు, ఎండీఎల్​ల రద్దు, సీనరేజీ వసూళ్ల బాధ్యతను ప్రైవేటుకు అప్పగించడం వంటి చర్యలతో ఇక్కడ 200 వరకు పరిశ్రమలు మూతపడ్డాయి. విద్యుత్‌ బిల్లులు కట్టలేక కొందరు యూనిట్లను మూసేసుకుంటే మరికొందరు యంత్ర సామగ్రిని తుక్కుకు అమ్మేసుకొని వెళ్లిపోయారు. దీంతో వేలమంది కూలీలకు ఉపాధి కరవైంది.

టీడీపీ హయాంలో మీటరు గ్రానైట్‌కు 2వేల రూపాయల రాయల్టీ ఉంటే జగన్‌ ప్రభుత్వంలో దాన్ని 3 వేల 450కు పెంచారు. గతంతో ఒక్కో పరిశ్రమకు సగటున లక్షా 30 వేల రూపాయల మేర విద్యుత్తు బిల్లు వచ్చేది. జగన్‌ ప్రభుత్వం కరెంటుఛార్జీలు పెంచడంతో లక్షా 80 వేల వరకు బిల్లు వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు. దీనికితోడు స్థానిక వైసీపీ నాయకులకు కమీషన్లు ఇవ్వలేదనే కారణంతో ఎండీఎల్​లను కొద్ది రోజులు బ్లాక్‌లో ఉంచారు. దీంతో ముడిసరకు దిగుమతి కష్టంగా మారి ఇబ్బంది పడ్డారు.

గ్రానైట్‌ పరిశ్రమలపై కక్షగట్టిన వైసీపీ ప్రభుత్వం- రాయితీల్ని గాలికొదిలేసిన జగన్​ సర్కార్​

తెలుగుదేశం హయాంలో ప్రముఖ టెక్స్‌టైల్స్‌ కంపెనీ జాకీ అనంతపురం జిల్లాలో యూనిట్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్లోనే అవసరమైన అనుమతులు, భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తిచేశారు. రాప్తాడు సమీపంలో 27 ఎకరాలు కేటాయించారు. ప్రత్యక్షంగా 6వేల మందికి ఉపాధి కల్పించేలా 129 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏటా 32.4 మిలియన్ల దుస్తులు తయారుచేసేలా కర్మాగారం ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. నిర్మాణ పనులూ మొదలుపెట్టారు. ఇంతలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధి తనకు 20 కోట్లు కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఆ కంపెనీ తెలంగాణకు తరలిపోయింది.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన రాయితీలను జగన్‌ ప్రభుత్వం మూడేళ్లుగా నిలిపివేసింది. దీంతో ప్రభుత్వాన్ని నమ్ముకుని పెట్టుబడులు పెట్టిన యువ పారిశ్రామికవేత్తలు తీవ్రంగా నష్టపోయారు. అనంతపురం జిల్లాలో ఎంఎస్​ఎంఈలు 361 వరకు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020లో రాయితీలు అందజేశారు. తర్వాత ఏటా సెప్టెంబరులో రాయితీలు చెల్లిస్తామంటూ సీఎం జగన్‌ అప్పట్లో ప్రకటించారు. మూడేళ్లు పూర్తయినా ఇప్పటివరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. అనంతపురం జిల్లావ్యాప్తంగా 361 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 50 కోట్ల రూపాయల మేర బకాయిలున్నాయి. ఎస్సీ, ఎస్టీలకైతే రెట్టింపు రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు. అలా చూస్తే అనంతపురం జిల్లాలోని దళిత, గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 35 కోట్లు చెల్లించాల్సి ఉంది.

ఏపీ బ్రాండ్​ వాల్యూను దిగజార్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం- జగన్ పుణ్యమా పరిశ్రమలు పరార్

హిందూపురం సమీపంలోని తూముకుంట పారిశ్రామికవాడలో 110 వరకు భారీ, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. వీటికి అవసరమైన నీటిని శ్రీరామిరెడ్డి పథకం నుంచి సరఫరా చేసేవారు. వైసీపీ పాలనలో నిర్వహణ కరవై పైపులైను దెబ్బతింది. దానికి కనీస మరమ్మతులు కూడా చేయించలేదు. దీనివల్ల పరిశ్రమల యజమానులు ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. ఈ సమస్యపై యజమానులు పలుమార్లు ప్రభుత్వాన్ని అభ్యర్థించినా పట్టించుకోలేదు. నీటి సమస్య కారణంగా కొత్త యూనిట్లు ప్రారంభించడం లేదు. మరోవైపు కరెంటు ఛార్జీల భారంతో రెండేళ్లలో ఇక్కడ పది తుక్కు పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో వాటిలో పనిచేసే 700 మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారు.

Last Updated : Apr 1, 2024, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details