Increasing Drug Use In Nellore District :మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాలు, సొల్యూషన్ ఇలా స్టఫ్ కోసం యువత ఎన్నో రకాలను ఉపయోగిస్తోంది. తాజాగా కొత్త రకమైనవి వెలుగులోకి వచ్చాయి. ప్లాస్టిక్ కవరులో పెయింటింగ్‌కు ఉపయోగించే ఒక రకమైన పదార్థాన్ని ఉంచి పీల్చుతున్నారు. చదువుకుని ప్రయోజకులుగా ఎదగాల్సిన వయసులో పెడదోవ పడుతున్నారు. వేదాయపాలెంలోని పదో తరగతి చదివే బాలుడి విషయమే ఉదాహరణ. అతని తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఆసుపత్రులకు తీసుకెళ్లినా కౌన్సెలింగ్ ఇప్పించినా రెండు రోజులకే పరిమితమవుతోంది. మళ్లీ మత్తు కోసం అన్వేషణ సాగిస్తున్నాడు.
- వేదాయపాలెం పోలీసుస్టేషన్ పరిధిలోని జ్యోతినగర్‌లో పదో తరగతి చదివే ఓ బాలుడు మత్తుకు అలవాటు పడ్డాడు. పెయింటింగ్ పనులకు ఉపయోగించే ఒక పదార్థాన్ని ప్లాస్టిక్ కవరుతో ఊది మత్తును అస్వాదిస్తున్నాడు. గత కొన్ని నెలల నుంచి ఈ అలవాటు ఉండగా తాజాగా మత్తులో పొరిగింట్లో అక్రమంగా ప్రవేశించాడు. అదేమని ప్రశ్నిస్తే వారిపైనే దాడికి పాల్పడ్డాడు.
- నగరంలో జరుగుతున్న పలు హత్యలు, హత్యాయత్నాలు మత్తులో చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
- నగరంలోని స్టేషన్ల పరిధిలో పోలీసులు నెలానెలా 150 మంది మత్తు బాధితులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వీరిలో ఎక్కువశాతం మత్తుకు బానిసైన వారిని తిరుపతి వ్యసన విముక్తి కేంద్రానికి పంపుతున్నారు.
విద్యార్థులనే ఆసరాగా చేసుకుని :లక్షలాది మంది విద్యార్థులు వివిధ కళాశాలల్లో చదువుతున్నారు. నెల్లూరు నగరం అభివృద్ధి చెందుతోంది. మెట్రో నగరాలకే పరిమితమైన కొన్ని వాణిజ్య సంస్థలు నెల్లూరులో ప్రవేశిస్తున్నాయి. వ్యాపార పరంగా విద్యార్థులు, ఉద్యోగులను, మహిళలను ఆకర్షించేందుకు కొత్త తరహా సంస్కృతిని తెస్తున్నారు. అయితే చెడు వ్యసనాలు కూడా పెరిగాయి. ఉల్లాసం, ఉత్సాహం కోసం విద్యార్థులు మత్తుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో అక్రమార్కులకు వీరు కల్పతరువుగా మారారు. కళాశాలలు, హాస్టళ్లు, గదులు వద్ద వీరి వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇతర రకాల మాదక ద్రవ్యాలను సైతం యువతకు పరిచయం చేయిస్తున్నారు.