Increasing Cases of Diarrhea Palnadu District :పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వారం రోజులుగా డయేరియా విజృంభిస్తోంది. రోజురోజుకూ వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో జిల్లా వైద్యాధికారులు నివారణ చర్యలపై దృష్టి సారించారు. స్థానికంగా వైద్యం అందించడంతోపాటు మెరుగైన ఆరోగ్యం కోసం బాధితులను నరసరావుపేట, సత్తెనపల్లి, గుంటూరు ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించి అతిసారం కట్టడి చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకూ ఆరుగురు మృతి చెందడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని లెనిన్ నగర్, మారుతీనగర్‌లో నివసించే ప్రజల్లో చాలా మంది వాంతులు, విరేచనాలతో సతమతమవుతున్నారు. మూడో తేదీ నుంచి ఇప్పటివరకూ రోజుకు 15 నుంచి 20 కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో దాదాపు 150 మంది అతిసారంతో ఆసుపత్రుల్లో చేరారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి 24 గంటలు వైద్యం అందిస్తున్నారు. అయినప్పటికీ డయేరియా కేసులు వస్తూనే ఉండటం స్థానికులను కలవరపాటుకు గురి చేస్తోంది.
కుళాయి నీటిలోకి డ్రైనేజీ మురికి నీరు కలవడం వల్లనే అతిసారం వ్యాప్తికి కారణమైందని వైద్యాధికారులు పరీక్షలు ద్వారా గుర్తించారు. మరోవైపు డ్రైనేజీ కాలువలు అధ్వానంగా ఉండటంతో పారిశుద్ధ్యం సమస్య కూడా డయేరియా వ్యాప్తికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.' -రవితేజ, పిడుగురాళ్ల ప్రభుత్వాసుపత్రి వైద్యుడు.ఆర్డీవో రమణకాంత్ రెడ్డి.