Good News For Home Guards:హోంగార్డులకు హైకోర్టులో ఊరట లభించింది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేవలం ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్ జాబితా తయారీ ప్రక్రియను పూర్తి చేయాలని న్యాయస్థానం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే:గత ప్రభుత్వంలో నిలిచిన పోలీసు కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ ఛైర్మన్ రవి ప్రకాష్ ఇటీవల వెల్లడించారు. అర్హులైన అభ్యర్ధులకు ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫిజికల్ టెస్ట్లు నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్ధులు ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కాల్ లెటర్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఫిజికల్ టెస్ట్ కు హాజరయ్యే అభ్యర్థులు slprb.ap.gov.in వెబ్ సైట్ నుంచి కాల్ లెటర్లు డౌన్ లోడ్ చేసుకోవాలని రవిప్రకాష్ తెలిపారు.
ఈ నేపథ్యంలో పోలీసు కానిస్టేబుల్ ఎంపికలో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని కోరుతూ హోంగార్డులు కోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్బంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు శీనాకుమార్, శివరాం, ఆంజనేయులు తదితరులు వాదనలు వినిపించారు. పోలీసు శాఖలో ఎన్నో ఏళ్లుగా హోంగార్డులుగా వీరు సేవలు అందిస్తున్నారని వారు తెలిపారు. కానిస్టేబుల్ ఎంపికలో వారిని ప్రత్యేక కేటగిరిగా చూడాలి కానీ అర్హత విషయంలో సాధారణ అభ్యర్థులతో సమానంగా చూడటం తగదన్నారు. పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో ప్రభుత్వం హోంగార్డులకు 1167 పోస్టులు కేటాయించిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
అయితే ప్రాథమిక పరీక్షలో కేవలం 382 మంది మాత్రమే అర్హత సాధించారని మిగిలిపోయిన పోస్టులను జనరల్ కేటగిరి కింద భర్తీ చేస్తున్నట్లు హైకోర్టుకు తెలిపారు. ఇలా చేస్తే హోంగార్డులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారి వాదనలను వినిపించారు. ప్రాథమిక రాతపరీక్షలో అర్హత మార్కులు సాధించని హోంగార్డు అభ్యర్థులు ప్రస్తుత వ్యాజ్యాలను దాఖలు చేశారని ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. ఓసారి నోటిఫికేషన్ జారీ చేశాక ఎంపిక మధ్యలో నిబంధనలను మార్పు చేయడం కుదరదన్నారు. ఇరువురి వాదోపవాదాలు పూర్తయిన తరువాత ప్రత్యేక కేటగిరీగా హోంగార్డులను పరిగణించాలని హైకోర్టు ఉత్తర్వులను జారీ చేస్తూ తుది తీర్పునిచ్చింది.