Heavy Rains in Andhra Pradesh : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది పూరీ తీరానికి వాయువ్యంగా 40 కిలోమీటర్లు, గోపాలపూర్‌కు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ప్రస్తుతం వాయుగుండం ఒడిశా నుంచి చిలకసరస్సు దగ్గరగా కదులుతోంది. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ఇది పయనిస్తోంది. వాయువ్య దిశగా కొనసాగుతూ రాగల 24 గంటల్లో ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సమీపంలో వాయుగుండం తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరప్రాంతాల్లోని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.
AP Weather Updates 2024 :మరోవైపు పశ్చిమ-వాయువ్య దిశగా వాయుగుండం కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని చెప్పారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ వివరించారు.
ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూల్ అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రోణంకి కూర్మానాథ్ పేర్కొన్నారు.