Minister kandula Durgesh Attend World Telugu Writers Conference : విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ ప్రాథమిక విద్యా స్థాయిలో కచ్చితంగా తెలుగు మాధ్యమం ఉండి తీరాలన్నారు. మాతృభాషలో బోధనే, విద్యార్థుల్లో సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుందన్నారు.
పరాయి భాషలు అవసరమే కానీ, ప్రాథమిక స్థాయిలోనే మన భాషను మర్చిపోయే పరిస్థితి రావడం దారుణమన్నారు. పరిపాలనా దక్షుడిగా పేరున్న చంద్రబాబుకు భాషపై అభిమానం ఉందని తెలిపారు. తెలుగు భాషా పరిరక్షణకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా స్పష్టమైన వైఖరితో ఉన్నారని వివరించారు.
తెలుగు భాషా వికాసానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. తెలుగు మహాసభల్లో చేసిన తీర్మానాలతో పాటు కార్యాచరణను కూడా తయారు చేసుకోవాలన్నారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని దుర్గేశ్ అన్నారు. గత ఐదేళ్లలో పాలకులు తెలుగు భాషకు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. సంపూర్ణంగా ఆంగ్ల మాధ్యమం ఉండాలన్న కుట్రతో మాతృభాషను దెబ్బతీశారన్నారు. తెలుగు వికాసాన్ని నాశనం చేసేలా తీసుకున్న నిర్ణయాలను భాషాభిమానులు, ప్రజలు ఓటుతో తిరస్కరించారని గుర్తుచేశారు.
తెలుగు భాషా విద్యార్థులకు రిజర్వేషన్లు - మహాసభ తీర్మానం
సాంస్కృతిక విశ్వవిద్యాలయం అవసరమే : ‘రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే తెలుగు భాష ఔన్నత్యాన్ని కోల్పోతోందన్న భావన సర్వత్రా ఉందని మంత్రి వెల్లడించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, మన వద్ద భాషా ప్రాధికార సంస్థ లేకపోవడం వల్ల తెలుగుకు సరైన ప్రోత్సాహం ఇవ్వలేకపోతున్నామన్నారు. భాషా వికాసానికి ప్రభుత్వమే కాదు, పౌరసమాజమూ బాధ్యత తీసుకోవాలన్నారు.
దీనికోసం అందరూ కలసి కృషి చేయాలని వివరించారు. క్షేత్రస్థాయి నుంచే ప్రణాళిక వస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. కొత్తతరం సామాజిక మాధ్యమాలు, ఇంటర్‌నెట్‌కు పరిమితమవుతోందన్నారు. పుస్తకాలు చదివేలా వారిని ప్రోత్సహిస్తే, భాషపై ఆసక్తి పెరుగుతుందన్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ సాహితీ పర్యాటకం గురించి చెప్పారని ప్రస్థావించారు.
దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. తద్వారా చిన్నారుల్లోనూ భాషపై అభిమానం పెరుగుతుందని, రచయితల మహాసభల స్ఫూర్తి జనబాహుళ్యంలోకి వెళ్లేలా మీడియా ఎంతో కృషి చేసిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలన్న వక్తల ఆకాంక్షను సాకారం చేసేందుకు ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు. పొట్టి శ్రీరాములు పేరిట వెలసిన తెలుగు విశ్వవిద్యాలయాన్ని గతంలో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేశామని. దీన్ని విస్తృతపరిచేలా కృషి చేద్దామని మంత్రి దుర్గేశ్ పేర్కొన్నారు.