How to Make Gongura Chicken Pachadi : చికెన్ కర్రీ పేరు చెప్పగానే మనలో చాలా మందికి నోరూరిపోతుంది. చికెన్‌తో ఫ్రై, బిర్యానీ, గ్రేవీ కర్రీ, చికెన్ పచ్చడి ఇలా ఏది చేసినా టేస్ట్ అద్భుతమే అంటారు నాన్‌వెజ్ లవర్స్! అయితే, మామూలుగా చికెన్ పచ్చడి పెట్టడం కామన్. అలా కాకుండా ఓసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా గోంగూర చికెన్ పచ్చడి పెట్టండి. ఇక్కడ చెప్పిన పక్క కొలతలు, టిప్స్‌తో చికెన్ పచ్చడి పెడితే టేస్ట్ అద్దిరిపోతుంది. అలాగే ఈ పచ్చడిలో చికెన్ ముక్కలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఎంతో కమ్మగా ఉంటాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా ఆహా అనిపించే గోంగూర చికెన్ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- ఎర్ర గోంగూర ఆకులు - పావు కేజీ
- బోన్‌లెస్ చికెన్ ముక్కలు - అరకేజీ
- మెంతులు - టేబుల్ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- చింతపండు - నిమ్మకాయ సైజంత
- వేరుశనగ నూనె - 2 టీ గ్లాసులు
- ధనియాలు - అర టేబుల్‌స్పూన్
- జీలకర్ర - అర టేబుల్‌స్పూన్
- మెంతులు - అరటీస్పూన్
- లవంగాలు - 5
- దాల్చినచెక్క - 1
- పసుపు - అరటీస్పూన్
- తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
- కారం - 5 టేబుల్‌స్పూన్లు
తయారీ విధానం :
- ముందుగా గోంగూర ఆకులను తెంపి క్లీన్‌గా రెండుమూడు సార్లు కడగండి. ఆపై ఆకులను పొడి వస్త్రంపై వేసి పూర్తిగా తడి లేకుండా ఆరనివ్వండి.
- పూర్తిగా ఆరిన ఆకులను సన్నగా కట్ చేసుకోండి.
- అనంతరం ఒక గిన్నెలో చింతపండు వేసి వేడినీరు పోసి నానబెట్టుకోండి.
- ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టండి. ఇందులో అర టీగ్లాసు పల్లీ నూనె పోయండి. నూనె వేడయ్యాక కట్ చేసిన గోంగూర ఆకులు వేసి ఫ్రై చేయండి.
- గోంగూర బాగా వేగిన తర్వాత చిక్కటి చింతపండు రసం యాడ్ చేసుకోండి.
- 5 నిమిషాల తర్వాత మరో అర టీగ్లాసు నూనె యాడ్ చేసి కలుపుకోండి.
- ఆపై గోంగూరలో ఆయిల్ సేపరెట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి.
- గోంగూరలో నూనె పైకి తేలిన తర్వాత పాన్ తీసి పక్కన పెట్టండి.
- అనంతరం మరో గిన్నె పెట్టండి. ఇందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు, లవంగాలు, దాల్చినచెక్క వేసుకుని వేపుకోండి. మసాలాలు దోరగా వేగిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పొడి చేసుకోండి.
- ఇప్పుడు అదే గిన్నె స్టవ్‌పై పెట్టి టీగ్లాసు ఆయిల్ వేసి వేడి చేయండి.
- స్టవ్ హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి వేడివేడి నూనెలో చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఆపై పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని వేపండి.
- ముక్క మరీ క్రిస్పీగా ఫ్రై చేయకుండా లోపల కాస్త సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ముక్క వేగిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్‌లో ఉంచి తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేయండి.
- ఒక 5 నిమిషాలు వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఈ చికెన్ ముక్కల మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
- ఇప్పుడు ముందుగా వేయించుకున్న గోంగూర వేసి కలపాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం, పులుపు సరి చూసుకోవాలి. పులుపు తక్కువైతే కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు.
- అంతే ఇలా చేసుకుంటే సూపర్ టేస్టీ గోంగూర చికెన్ పచ్చడి రెడీ!
- ఈ చికెన్ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.
గోంగూర చికెన్ పచ్చడి మీకు నచ్చితే ఓ సారి ఇలా ట్రై చేయండి.
హోటల్ స్టైల్లో రవ్వ ఊతప్పం - ఈజీగా అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు!