ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైసీపీ నేతలకు కాసులవర్షం - యథేచ్ఛగా అక్రమ కట్టడాలు

Illegal Constructions in Guntur: అక్రమ కట్టడాలు, అనుమతులు లేని నిర్మాణాలకు గుంటూరు నగరపాలక సంస్థ యంత్రాంగం, ప్రజాప్రతినిధుల అండ మెండుగా ఉంటోంది. ప్రణాళిక విభాగంలోని కొందరు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వీరికి తోడు కొందరు వైసీపీ కార్పొరేటర్లు, ప్లానింగ్‌ సెక్రెటరీలు కుమ్మక్కై అనుమతులు లేకుండా భవన నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. నగరపాలక ఆదాయానికి భారీగా గండి పడుతుంటే కార్పొరేటర్లు, అధికారులకు కాసులవర్షం కురుస్తోంది.

Illegal_Constructions_in_Guntur
Illegal_Constructions_in_Guntur

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 10:35 AM IST

Illegal Constructions in Guntur: గుంటూరులో అనధికారిక నిర్మాణాలు ప్రధాన రహదారుల పక్కనే నిర్మితమవుతున్నా మేయర్‌, కమిషనర్‌కు అవి కనిపించడం లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కచ్చితంగా భవన నిర్మాణాలను తనిఖీ చేయాలి. ప్లాన్ తీసుకున్నారా లేదా, అలాగే నిబంధనల ప్రకారమే కడుతున్నారా? ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించాలి. కానీ అదేమీ జరగడం లేదు.

అందుకు ఇన్నర్ రింగ్‌ రోడ్డులోని ఈ వాణిజ్య భవనమే నిదర్శనం. కనీస ప్లాన్‌ లేకుండా దీన్ని నిర్మించారు. సీఎంఓలో పనిచేసే ఓ ఉన్నతాధికారి సిఫారసు చేశారని అధికారులు నిబంధనలు వదిలేశారు. అందులో మద్యం దుకాణం నడుపుకోవడానికి అనుమతి కూడా పొందారు. భవన అనుమతుల ఫీజుల రూపేణా రూ.8 లక్షలు వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రణాళికాధికారి ఒకరు రూ.2లక్షలు తీసుకుని సీఎంఓ నుంచి సిఫార్సు ఉందని దాని జోలికి వెళ్లలేదు.

విజయవాడలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు - 'అంతా నా ఇష్టం' అంటున్న వైసీపీ ఎమ్మెల్యే!

అత్యంత రద్దీగా ఉండే కొత్తపేట భగత్‌సింగ్ విగ్రహం కూడలి వద్ద 120 గజాల స్థలంలో ఓ G+3 భవనం నిర్మిస్తున్నారు. G+1కి అనుమతి తీసుకుని అదనంగా మరో 2 అంతస్తులు నిర్మిస్తున్నారు. కనీసం వాహనాలకు పార్కింగ్ లేకుండా భారీ వాణిజ్య సముదాయం నిర్మితమవుతోంది. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. కమిషనర్‌ క్షేత్రస్థాయి పరిశీలన లేకపోవడం వల్లే ఇలాంటి ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఆర్‌.అగ్రహారంలోని చలమయ్య జూనియర్ కళాశాల సమీపంలో కేవలం 70-80 గజాల స్థలంలో భారీ భవన నిర్మాణం చేపట్టారు. జీ+1కు అనుమతి పొంది అనధికారికంగా మరో రెండు అంతస్తులు పేకమేడల్లా నిర్మిస్తున్నారు. సెట్‌బ్యాక్స్‌ చాలావరకు రోడ్డుమీదకు చొచ్చుకొచ్చాయి. ఇంత భారీ భవంతికి కనీసం పార్కింగ్ లేదు. ఓ వైసీపీ కార్పొరేటర్ సిఫార్సులు ఉండటంతో అధికారులు వ్యక్తిగత లబ్ధి చూసుకుని ఉల్లంఘనల్ని చూసీచూడనట్లు వదిలేశారు.

ఖాళీ స్థలాల వివరాలు లేవంటున్న వీఎంసీ - మురుగు నీరు చేరి నగరవాసుల అవస్థలు

అరండల్‌పేట రెండో వార్డులోనూ నిబంధనలు పక్కనపెట్టి ఓ భవనాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధి సన్నిహితులు నిర్మిస్తున్నారు. దీనికి ప్లాన్ ఉన్నప్పటికీ, దానికి అనుగుణంగా నిర్మాణం జరగడం లేదు. అనేక ఉల్లంఘనలు ఉన్నాయి. రోడ్డు మీదకు సెట్‌బ్యాక్‌లు చొచ్చుకొస్తున్నాయి. ఇలాంటి భవనాల్లో ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే కనీసం వాహనం వెళ్లేందుకు కూడా వీలుండదు. అది భారీ నష్టానికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. అయితే వైసీపీ కార్పోరేటర్లు, అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ భవన యజమానుల నుంచి వసూళ్లు చేసి అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగేలా చూస్తున్నారు. దీనికి కొందరు అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

అనధికార నిర్మాణాలకు ఇవి కొన్ని నిదర్శనాలు మాత్రమే. ఇలాంటివి నగరంలో కోకొల్లలు. జీ+1కు అనుమతి తీసుకుని అదనపు అంతస్తులు నిర్మించినవి చాలా ఉన్నాయి. వీటిని ఏ ఒక్క అధికారి తప్పు పట్టే పరిస్థితి లేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వీటికి దన్నుగా నిలబడుతున్నారు. స్థానిక కార్పొరేటర్లు ముడుపులు తీసుకుని అధికారుల్ని అటువైపు వెళ్లకుండా చూస్తున్నారు. ఆదిలోనే వీటిని కట్టడి చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి వ్యవహారాలు, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అక్రమ నిర్మాణాలు సక్రమంగా సాగిపోతున్నాయి.

చంద్రబాబు ప్రారంభించారని జగన్ సర్కారు వివక్ష.. పిల్లర్ల దశలోనే వీఎంసీ భవనం

ABOUT THE AUTHOR

...view details