IIT Teams at Amaravati : రాష్ట్రరాజధాని అమరావతిలో ఐదు సంవత్సరాలుగా ఎండకు ఎండి, వానకు తడిసిన నిర్మాణాలు మొత్తం పాడుబడ్డాయి. వీటిని శుక్రవారం పరిశీలించిన హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం (Hyderabad IIT Team) అవాక్కయింది. ఎన్జీవో నివాస సముదాయాల్లో ఇనుప చువ్వలు భారీగా తుప్పుపట్టాయి. వీటి విషయంలో ఏం చేయాలన్నది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు తెలిపారు. చువ్వలను పూర్తిగా తొలగించిన తర్వాత, లేదా శుభ్రం చేసిన తర్వాతే పనులు ప్రారంభించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.
పూర్తి స్థాయి పరీక్షలు చేసిన తర్వాతే సామర్థ్యం తేలుతుందని చెప్పారు. ఈ సమస్యను నిశితంగా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగాలని, ఇందుకు చాలా సమయం పడుతుందని అన్నారు. విభాగాధిపతుల బంగ్లాల్లో ఇనుప చువ్వలు తుప్పు పట్టి, స్తంభాలు పలు చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. కట్టడాల పటిష్ఠతను అంచనా వేసేందుకు మట్టి పరీక్షలతో పాటు నాన్-డిస్ట్రక్టివ్, కోర్ కటింగ్ పరీక్షలు నిర్వహించాలని సీఆర్డీఏ (CRDA) అధికారులకు నిపుణులు సూచించారు.
రాజధాని అమరావతిలో ఐఐటీ హైదరాబాద్ నిపుణుల పరిశీలన - IIT Teams Visit Amaravati Today
ఎన్నేళ్ల నుంచి పనులు ఆగిపోయాయి? :గత టీడీపీ హయాంలో ప్రారంభమై చివరి దశలో ఉన్న నిర్మాణ పనులన్నింటినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపివేసి, వాటిని పాడుబెట్టింది. ఈ కట్టడాల పటిష్ఠతను నిర్ధారించేందుకు ఐఐటీ బృందం రాజధానిలో పర్యటించింది. తొలుత ఈ బృంద సభ్యులు సీఆర్డీఏ (CRDA) ఇంజినీరింగ్ అధికారులతో కలసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లలో పలు టవర్లను పరిశీలించారు.
అనంతరం మోడల్ ఫ్లాట్‌లో సీఆర్డీఏ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నివాస సముదాయాల నిర్మాణానికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు? ఎన్నేళ్ల నుంచి పనులు ఆగిపోయాయి? నిర్మాణాల ప్లాన్, తదితర వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అఖిల భారత సర్వీసు అధికారులు, విభాగాధిపతులు, ఎన్జీఓ, గెజిటెడ్, నాలుగో తరగతి ఉద్యోగుల బంగ్లాలు, క్వార్టర్లలో కలియతిరుగుతూ నిర్మాణాలను ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది.
అమరావతిలో నిర్మాణాలు ఎలా ఉన్నాయి? - అధ్యయనానికి సాంకేతిక కమిటీ నియామకం - Committee on capital region
ఐఐటీ మద్రాసు బృందం పరిశీలన :ఐఐటీ హైదరాబాద్ బృందం నేడు (శనివారం) కూడా రాజధానిలో పర్యటిస్తుంది. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) చేపట్టిన పనులను పరిశీలిస్తుంది. రోడ్లు, వంతెనలు, విద్యుత్తు, కమ్యునికేషన్ కేబుళ్ల డక్ట్‌ల సామర్థ్యాన్ని నిపుణులు అధ్యయనం చేస్తారు. మరో వైపు ఐఐటీ మద్రాసు బృందం (IIT Madras Team) శనివారం జీఏడీ టవర్లు, శాశ్వత హైకోర్టు పునాదులు, ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులను పరిశీలిస్తుంది. గత ఐదు సంవత్సరాలుగా ఇవి పూర్తిగా నీటిలోనే ఉన్నాయి. వీటిని పరిశీలించేందుకు ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాన్ని పిలిపించి, వారి పడవల్లో వెళ్లనున్నారు.
సీఆర్డీఏకు నివేదిక అందజేస్తాం :కట్టడాల సామర్థ్యం గురించి ఇప్పుడే వ్యాఖ్యానించలేమని హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం అధికారి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం అన్నారు. అన్నింటినీ క్షుణ్నంగా అధ్యయనం చేసి, వీలైనంత త్వరగా సీఆర్డీఏకు నివేదిక అందజేస్తామని, ప్రస్తుత స్థాయి నుంచి ఏం చేస్తే నిర్మాణాలు పూర్తి చేసి వినియోగంలోకి తేగలరన్న అంశంపై తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్న బృందంతోనే వచ్చామని, తర్వాత అవసరాన్ని బట్టి మరింత విస్తరిస్తామని అన్నారు. అధ్యయనంలో తేలిన దానిని బట్టి అమరావతిలో తమ తదుపరి పర్యటన ఉంటుందని ఆయన వెల్లడించారు.
అమరావతి ఐఆర్ఆర్పై ప్రభుత్వం ఫోకస్ - త్వరగా పట్టాలెక్కించేందుకు కసరత్తు - Amaravati Inner ring Road