HYDRA Focuses on Encroached Ponds Beautification in Hyderabad :నెల రోజుల పాటు కూల్చివేతలకు విరామం ఇచ్చిన హైడ్రా, ఈ సమయంలో మహానగరం పరిధిలోని ప్రతి చెరువు చరిత్రను వెలికి తీయాలని నిర్ణయించింది. ఇందులో సుమారు 200 మంది అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. దీనికి అత్యాధునిక వ్యవస్థలను ఉపయోగించనున్నారు. భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకుండా రియల్ టైం లొకేషన్ వ్యవస్థనూ అందుబాటులోకి తేవడానికి హైడ్రా కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే కూల్చిన చెరువులను తిరిగి పునరుద్ధరించడానికి హైడ్రా ప్లాన్ చేస్తోంది. మరోవైపు ఇప్పటికే కూల్చివేతలు చేపట్టిన చెరువుల సుందీరకరణను పనులను ఈ వారంలో మొదలు పెట్టాలని నిర్ణయించింది. డిసెంబర్ నెలాఖరు నాటికి కొన్ని చెరువుల సుందరీకరించి, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని అనుకుంటున్నారు.
వారి వల్లే నగరంలో ఆక్రమణలు :నగరంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఎలాంటి పరిశీలనలు చేయకుండా భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతోనే అక్రమాలు జరుగుతున్నాయని తేలింది. ఒక సర్వే నంబర్‌ను తీసుకుని, మరో సర్వే నంబరులో భవనాలు నిర్మిస్తున్న విషయం హైడ్రా గుర్తించింది. ఇలాంటివి పునరావృత్తం కాకుండా రియల్‌టైం లొకేషన్ వ్యవస్థను తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఒక సర్వే నంబర్‌ను కొడితే, దాని ఫొటోతో సహా క్షేత్రస్థాయిలో కో-ఆర్డినేట్స్ అధికారులకు తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా నిరోధించవచ్చని అధికారులు భావిస్తున్నారు.