Hydra Demolition in Alkapuri Colony in Hyderabad :తెలంగాణలో హైడ్రా మరోసారికొరడా ఝుళిపించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక నిర్మాణాలపై హైడ్రా, మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అల్కాపురి టౌన్‌షిప్‌లోని 'అనుహార్ మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్స్'లో ఎటువంటి అనుమతి లేకుండా వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారన్న కారణంతో నాలుగు షట్టర్లను అధికారులను తొలగించారు.
గురువారం ఉదయం అక్కడికి చేరుకున్న హైడ్రా, మున్సిపల్, పోలీసులు అధికారులను అపార్ట్‌మెంట్‌లోని పలువురు నిలువరించారు. వారి అభ్యర్థనలను లెక్కచేయని అధికారులు రెండు జేసీబీలతో షట్టర్లను ధ్వంసం చేశారు. దీంతో మున్సిపల్, హైడ్రా అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016 సంవత్సరంలో హెచ్ఎండీఏ అనుమతులతో రామిరెడ్డి అనే యజమాని గ్రౌండ్ ఫ్లోర్, సెల్లార్, 5 అప్పర్ ఫ్లోర్లతో 'అనుహార్ మార్నింగ్ రాగా' అపార్ట్‌మెంట్స్‌ను నిర్మించారు.
అనంతరం అందులో నివాసం ఉంటున్న వారి కోసం గ్రౌండ్‌ఫ్లోర్‌లో బ్యాంకు, నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్ల దుకాణాలను ఏర్పాటు చేసి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ విషయంపై అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తి స్థానిక మున్సిపల్, హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్‌మెంట్‌లో అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
భూకబ్జాదారులపై కఠిన చర్యలు తప్పవు - మరోసారి హెచ్చరించిన రంగనాథ్