Hydra Commissioner Ranganath Review Meeting : హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటల ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లపై గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాలు, పౌర సమాజంతోపాటు ఉన్నత న్యాయస్థానాలు కూడా ప్రశ్నిస్తుండటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. గ్రేటర్ పరిధితో పాటు ఓఆర్ఆర్ లోపల చెరువుల సంఖ్యతోపాటు వాటి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై రోజుకో లెక్క పూటకో మాట వినిపిస్తుండటంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో లేక్ ప్రొటక్షన్ కమిటీ ఛైర్మన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల గుర్తించేందుకు నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. ఓఆర్ఆర్ పరిధిలో ఎన్ని చెరువులున్నాయి, ఎంత మేర ఆక్రమణలకు గురయ్యాయో లెక్కలు తేల్చాలంటూ అధికారులకు సూచించారు. ఆయా చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు శాస్త్రీయ పద్దతులు అనుసరించే అంశాలపై సమీక్షించారు. అలాగే గతంలో నిర్ధారించిన ఎఫ్‌టీఎల్ సరిగా లేని పక్షంలో వాటిని సవరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రంగనాథ్ అధికారులను ఆదేశించారు.
ఆక్రమణలకు ఆస్కారం లేకుండా యాప్ :నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ప్రజావసరాలకు నిర్దేశించిన స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా నిరంతరం నిఘా పెట్టేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటుందని రంగనాథ్ పేర్కొన్నారు. ఆక్రమణలకు ఆస్కారం లేకుండా క్షణాల్లో సమాచారం వచ్చేలా ప్రత్యేక యాప్‌ను తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ యాప్ ద్వారా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నామని, క్షేత్ర స్థాయిలో అధికారుల పరిశీలన, చర్యల నమోదు తదితర వివరాలను యాప్లో నమోదు చేయవచ్చని రంగనాథ్ తెలిపారు.