34 Biryanis Orders Per Minute in Hyderabad :హైదరాబాద్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్టీ ఏదైనా, గెస్ట్లు ఎవరైనా బిర్యానీ మస్ట్! వంట చేయడానికి బద్ధకంగా అనిపించినప్పుడు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టాలనుకున్నప్పుడు మొదటగా గుర్తొచ్చేది ఇదే! అంతలా నగర జీవనశైలిలో భాగమైపోయింది. పండుగలు, ప్రత్యేక వేడుక రోజుల్లో బంధు మిత్రులు కలిసి దీన్ని ఆరగిస్తారు. బిర్యానీ క్రేజ్ అంటే అదే మరీ.
మరీ ఎంతలా అంటే నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నారు హైదరాబాదీలు. ఈ లెక్క దేశంలోనే అత్యధికం. సంవత్సర కాలంలో ఏకంగా 1.57 కోట్ల ప్లేట్ల బిర్యానీలను ఆరగించారు మనోళ్లు. మధ్యాహ్నం, రాత్రి మాత్రమే కాదు, ఏకంగా తెల్లవారుజామున 4 గంటలకూ బిర్యానీల ఆర్డర్ ఇస్తున్న వారూ ఉన్నారు. హైదరాబాద్‌కు సంబంధించి స్విగ్గి విడుదల చేసిన ఆర్డర్లే ఇలా ఉంటే మిగతా సంస్థలవి, రెస్టారెంట్లో, వేడుకల్లో ఆరగించే విందులను కలుపుకొంటే బిర్యానీల సంఖ్య రెట్టింపుకన్నా ఎక్కువే.
అత్యధికులు చికెన్ బిర్యానీనే ఆరగిస్తున్నారు. ఒక వ్యక్తి ఈ ఏడాదిలో 60 బిర్యానీల కోసం ఏకంగా రూ.18,840 వెచ్చించారు. మనోళ్లకు క్రికెట్ అంటే వేరేలెవల్ అభిమానం అని అందరికీ తెలుసు కానీ మ్యాచ్ చూస్తూ బిర్యానీని ఆరగిస్తే ఆ మజానే వేరంటున్నారు ప్రేక్షకులు. టీ20 ప్రపంచకప్ సందర్భంగా 8.69 లక్షల ఆర్డర్లు ఇచ్చారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు.